ఖైర‌తాబాద్ నుంచి కేటీఆర్ పోటీ?

 Posted March 25, 2017

ktr participated as mla in hyderabad for next elections
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల త‌ర్వాత మంత్రి కేటీఆర్ … గ్రేట‌ర్ హైద‌రాబాద్ పైనే ఎక్కువ ఫోక‌స్ చేస్తున్నారు. ఇప్పుడు సిటీలో శంకుస్థాప‌న‌లు, ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌న్నీ ఆయ‌న చేతుల మీదుగానే జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ హైద‌రాబాద్ పై కాస్త ఎక్కువ ప్రేమ చూపెడుతున్నారా? అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాల‌తో మంత్రి కేటీఆర్ బాగా ఇంప్రెస్ అయిపోయార‌ట‌. కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ్నుంచే పోటీ చేయ‌డంపై ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. తాను ఇక్క‌డ్నుంచి పోటీ చేయ‌డం ద్వారా టీఆర్ఎస్ కు ఓట్లు రావ‌డంతో పాటు ఇత‌ర పార్టీలను కూడా బాగా వీక్ చేయ‌వ‌చ్చ‌న్న‌ది ఆయ‌న ప్లాన్ అట‌. అందులో భాగంగానే ఖైర‌తాబాద్ నుంచి కేటీఆర్ పోటీ చేసే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక్క‌డ్నుంచి అయితే త‌న గెలుపు ఈజీ అని భావిస్తున్నార‌ట కేటీఆర్. ఇందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి దానం నాగేంద‌ర్, బీజేపీ నుంచి ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి పోటీ చేసే అవ‌కాశ‌ముంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఓట్లు చీలిపోతాయి కాబ‌ట్టి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా త‌న విజ‌యం సులువ‌ని కేటీఆర్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

ఒక‌వేళ ఖైర‌తాబాద్ నుంచి కుద‌ర‌క‌పోతే ఉప్ప‌ల్ ను ఎంచుకునే అవ‌కాశ‌ముంద‌ట‌. ఉప్ప‌ల్ లో ఏ పార్టీ నుంచి కూడా బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేరు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ‌ టీడీపీతో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల బీజీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్ర‌భాక‌ర్ గెలుపొందారు. కాబ‌ట్టి త‌న విజ‌యం ఇక్కడ్నుంచి కూడా ఈజీయేన‌ని కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయ‌న ఇక్క‌డ్నుంచి పోటీ చేసే అవ‌కాశం లేక‌పోలేదు.

మొత్తానికి ఖైరతాబాద్, ఉప్ప‌ల్ .. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కడో ఓచోట కేటీఆర్ పోటీచేయ‌డం ప‌క్కా అంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. అంతేకాదు ఆయ‌న పోటీ చేయాల‌ని కూడా సిటీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ‌లంగా కోరుకుంటున్నారు. ఆయ‌న గెల‌వ‌డంతో పాటు త‌మ విజ‌యానికి ఆయ‌న స‌హ‌క‌రిస్తార‌ని వారు ఆశిస్తున్నారు. మ‌రి ఎన్నిక‌లకు ఇంకా చాలా టైముంది కాబ‌ట్టి… అప్ప‌టికి కేటీఆర్ ఆలోచ‌న ఎలా ఉంటుందో?

SHARE