ఆ పిల్ల జేబులో చపాతీ ఎందరికో మేలుకొలుపు..

0
512
ktr response towards children school timings

Posted [relativedate]

ktr response towards children school timings
ఓ అక్షరం లక్ష మెదళ్లలో కదలిక తెస్తే …మరి ఓ దృశ్యం కోటి గుండెల్ని పిండేయగలదు. ఇప్పుడు అదే జరిగింది.జేబులో చపాతీ పెట్టుకున్న ఓ చిన్నారి ఫోటో పెద్దల మనసుల్ని మెలిపెడుతోంది.తల్లితండ్రుల హృదయాల్ని కలచివేస్తోంది.చిన్నారుల బాల్యాన్ని నలిపేస్తున్న విద్యావ్యవస్థ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.మొద్దుబారిపోయిన పాలక వ్యవస్థని తక్షణం కదిలించేస్తోంది.
ఇంతకీ ఈ ఫోటో చెప్పిన కధ..విప్పిన గుట్టు మరేదో కాదు.నిత్యం కళ్లెదుట జరుగుతున్న ఘోరం. తెలియని రేపటి కోసం బాల్యాన్ని బలిపీఠం ఎక్కిస్తున్న దైన్యం.సురేన్ అనే ఓ పెద్దాయన ఈ దారుణాన్ని కళ్ళకు కట్టే ఓ చిత్రాన్ని సోషల్ మీడియా లో ఉంచారు.ఓ చిన్నారి జేబులో చపాతీ పెట్టుకుని స్కూల్ ప్రేయర్ లో పాల్గొంటున్న దృశ్యమది.పొద్దున్న 8 గంటలకు మొదలయ్యే స్కూల్స్ కి పిల్లలని పంపాలంటే …వేకువజామునే వారిని నిద్ర లేపాలి..కాలకృత్యాలు అనంతరం టిఫిన్ పెట్టాలి …మధ్యాహ్నానికి బాక్స్ పెట్టాలి..ఇంతా చేస్తే స్కూల్ బస్సు మిస్ కాకుండా చూడాలి.ఇదంతా వివరిస్తుంటే తల్లిదండ్రులకి ఎన్ని కష్టాలో అనిపిస్తోందా? మరి వారు చెప్పినట్టల్లా చేస్తూ కంటి నిండా సరైన నిద్ర ,ఆకలి తీరా ఆహారం,వంటికి సరిపడా ఆటలు,మనసుకు సరిపడా తీపి అనుభూతులు లేని ఆ చిన్నారుల గురించి ఏ0మనుకోవాలి ?
ఒకటి రెండు తరాల వెనక్కి వెళితే మీ జీవితంలో అద్భుత సమయం ఎప్పుడని ఎవరిని కదిలించిన ఒక్కటే సమాధానం..అదే బాల్యం. ఆస్తులు,అంతస్తులు,పేదరికం,కష్టం ,నష్టం మధ్య కూడా బాల్యం ఓ తీపి గురుతుగా మిగిలిపోడానికి ఒకటే కారణం..అదే ఒత్తిడి లేని జీవితం.ఇప్పుడు పాలు మానగానే మాటలు కాదు కాదు రైమ్స్ నేర్చుకునే రేస్…ఆ పై ప్లే స్కూల్ …స్కూల్ ..ఇలా ప్రతి నిమిషం ఓ పోటీ ..బాల్యంలో ఆస్వాదన పోయి పోరాటమే మిగులుతోంది.అందుకు సాక్ష్యమే ఈ చిన్నారి ఫోటో.టిఫిన్ చేసే టైం లేక చపాతీ జేబులో పెట్టుకుని స్కూల్ కి వచ్చిన ఆ పిల్ల వయసెంత ? ఆ చిన్నారి మోస్తున్న చదువుల బరువెంత? ఈ ప్రశ్న లేవదీసేందుకు …ఉదయాన్నే చిన్న పిల్లల స్కూల్ టైం మార్చాలని కోరేందుకు సురేన్ ఈ ఫోటో ఉంచారు.దాన్ని చూసిన తెలంగాణ మంత్రి Ktr కదిలిపోయారు.నిజమే కదా..చిన్నారుల బాల్యాన్ని ఇంతగా చిదిమేస్తున్నామా అని ఆలోచనలో పడ్డారు.దానికి విరుగుడుగా స్కూల్ టైమింగ్స్ మార్చేందుకు గట్టి ప్రయత్నం చేయడానికి టీ సర్కార్ నడుం కట్టినట్టు తెలుస్తోంది.ఆ ఊహకే పులకింతగా వుంది.బాల్యం ఇక బందీ కాదన్న వార్తే కొత్త ఉత్సాహమిస్తోంది.కంటి నిండా నిద్ర,సమయానికి తిండి,వీటన్నిటికీ మించి కాసేపు అమ్మానాన్న తో కలిసి ఉండటం …అబ్బా గడియారంలో ముళ్ళు కాస్త తిరిగితే ఇన్ని సౌలభ్యాలా? ఇంకెందుకు ఆలస్యం ముళ్ళు తిప్పేద్దాం ..బాల్యాన్ని బతికిద్దాం.

Leave a Reply