పెట్టుబడుల సాధనా..? పార్టీ విస్తరణా..?

0
581
ktr uses america visit not only for investments but to expand party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ktr uses america visit not only for investments but to expand party
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన అమెరికా పర్యటనను పెట్టుబడుల సాధనకే కాకుండా…రాజకీయంగా తమ పార్టీ బలాన్ని పెంచుకునేందుకు కూడా ఉపయోగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పలు కంపెనీల అధినేతలతో పెట్టుబడుల సాధనకు సమావేశం అవుతున్న మంత్రి కేటీఆర్ ఈ క్రమంలోనే టీఆర్ఎస్ సానుభూతిపరులైన ఎన్నారైలతో సమావేశమయ్యారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటాక్లారాలో టీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ – కాంగ్రెస్ నాయకులను చూసి చిన్న పిల్లలు కూడా అసహ్యించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

వెయ్యి మంది విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ నాయకులే కారణమని కేటీఆర్ మండిపడ్డారు. ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత పాలనను అందిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాదక్షతను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారని చెప్పారు. నీళ్లతోనే అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయతో 46 వేల చెరువులను పునరుద్ధరిస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని మేనిఫేస్టోలో చెప్పినవే కాకుండా చెప్పని పథకాలను కూడా ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ ఎస్ దేనని కేటీఆర్ అన్నారు.

కళ్యాణలక్ష్మీ తో నిరుపేద ఆడబిడ్డల పెళ్లి భారం కాకుండా చూస్తున్న ఒకే ఒక ప్రభుత్వం తమదే అని కేటీఆర్ వివరించారు. గర్భిణీలకు 12 వేలు ఇవ్వడంతో పాటు ఆడపిల్ల పుడితే 13 వేలు ఇస్తున్నామని కేసీఆర్ కిట్ లో 13 రకాల వస్తువులను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. గుర్రాలతో తొక్కించి అంగన్ వాడీలను అణిచివేసిన అమానవీయ చరిత్ర చంద్రబాబుది అయితే అంగన్ వాడీలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రోత్సాహకాలు అందిస్తున్న వర్తమానం తమ పార్టీదన్నారు. కాగా స్వామికార్యంతో పాటుగా స్వకార్యం అన్నట్లుగా ఇటు పెట్టుబడుల సాధన అటు పార్టీ విస్తరణ అనే ఎజెండాతో కేటీఆర్ ముందుకు సాగుతున్నారని పలువురు చమత్కరిస్తున్నారు.

Leave a Reply