Posted [relativedate]
గ్రేటర్ హైదరాబాద్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ఒకే పార్టీ వారే ఉండడం చాలా అరుదు. వేర్వేరు పార్టీల వారు కావడంతో ఇద్దరి మధ్య విభేదాలు రావడం కూడా కామనే. ఏళ్లుగా ఇదే జరుగుతోంది. అయితే ఇప్పుడు గ్రేటర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ టీఆర్ఎస్ వారే ఉన్నారు. అయిప్పటికీ ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్టుగా ప్రచారం జరుగుతోంది.
గ్రేటర్ అభివృద్ధి పనుల విషయంలో మేయర్ బొంతు రామ్మోహన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అసంతృప్తితో ఉన్నారట. ఎందుకంటే ఈ మధ్య మేయర్ ఏ సమీక్షలు నిర్వహించినా.. ఆయనకు ఆహ్వానం అందడం లేదని టాక్. ఇక పనుల విషయంలోనూ డిప్యూటీ మాట అస్సలు చెల్లుబాటు కావడం లేదు. కొందరు కార్పొరేటర్లు బొంతు రామ్మోహన్ దగ్గరకు డైరెక్టుగా వచ్చి పనులు చేయించుకొని వెళ్లిపోతున్నారట. కానీ డిప్యూటీ మేయర్ మాత్రం పనులు చేయించుకోలేకపోతున్నారు. కావాలనే మేయర్ ఇలా చేస్తున్నాడని ఫసియుద్దీన్ వర్గం ఆరోపిస్తోందట.
ఈ ఇద్దరి పంచాయితీ మంత్రి కేటీఆర్ దగ్గరకు కూడా వెళ్లిందట. ఈ విషయంలో కేటీఆర్ కూడా డిప్యూటీ మేయర్ వాదనతో ఏకీభవించారట. హైదరాబాద్ లో బలమైన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ ను నిర్లక్ష్యం చేయడం తగదని అక్షింతలు వేశారట. ఒకవేళ ఇదే కొనసాగితే డిప్యూటీ మేయర్ తరపున ఎంఐఎం గొంతెత్తే అవకాశముంది. అలా జరిగితే ప్రతిపక్షాల చేతికి కత్తి ఇచ్చినట్టే.. టీఆర్ఎస్ కు జనంలో ఉన్న ఆదరణ తిరగబెట్టే ప్రమాదముంది. అందుకే ఇకమీద ఇలా చేస్తే ఊరుకునేది లేదని గ్రేటర్ మేయర్ కు గట్టి వార్నింగే ఇచ్చారట కేటీఆర్.