కేవీపీ వెనుక టీడీపీ.? బీజేపీ డౌట్

0
853

kvp tdp bjp war

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం టీడీపీ బీజేపీ మిత్రపక్షాల మధ్య మరోసారి చిచ్చుకు కారణమవుతోంది. ఈ చిచ్చుకు ఆజ్యం పోసే పనిలో కాంగ్రెస్ పడింది అసలు ఓటింగు సాధ్యం కాని ప్రత్యేక హోదా బిల్లును అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయం చేస్తోందని, కేంద్రంలో ఇద్దరు మంత్రులుండగా, కాంగ్రెస్ ఎంపి కెవిపి ప్రైవేటు బిల్లును ఎలా సమర్థిస్తుందని కమల నేతలు మండిపడుతున్నారు. ఏడాది నుంచీ ఈ అంశంలో కాంగ్రెస్ నేతలతో హోదాపై పరోక్షంగా ఒత్తిడి చేయిస్తూ, మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోందన్న అనుమానం బీజేపీలో వ్యక్తమవుతోంది. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఓటింగుకు వస్తుందన్న చర్చ నేపథ్యంలో, ఓటింగు జరిగితే తమ మద్దతు ఉంటుందని తెదేపా ఎంపిలు జెసి దివాకర్‌రెడ్డి, టిజి వెంకటేష్ బహిరంగంగా ప్రకటించడాన్ని బిజెపి తప్పుపడుతోంది.దీని వెనుక తెదేపా రహస్య అజెండా ఉందని, అసలు తెదేపా నాయకత్వమే కాంగ్రెస్ ఎంపితో బిల్లు పెట్టించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరైతే బిల్లు ప్రవేశపెట్టారో ఆయన బినామీ కంపెనీకి వైఎస్ ప్రభుత్వం గతంలో ప్రాజెక్టులు కట్టబెట్టిందని ఆరోపించిన తెదేపా, ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టును అదే కంపెనీకి కట్టబెట్టిందని, దాన్ని బట్టి ఎవరి రహస్య బంధమేమిటో బట్టబయలయిందని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ సభ్యుడి ద్వారా ఒత్తిడి రాజకీయం చేస్తున్న టీడీపీకి, తాము కూడా సరైన సమాధానం చెబుతామంటున్నారు. కేంద్రంలో ఇద్దరు మంత్రులున్న టీడీపీ, కాంగ్రెస్ సభ్యుడి ప్రైవేటు బిల్లు ఓటింగు వరకూ వస్తే దానిని సమర్ధించడం అనైతికం కాదా? అని బిజెపి ప్రశ్నిస్తోంది. మరో వైపు వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఫిరాయింపునిరోధక చట్టంపై ఇచ్చిన ప్రైవేటు మెంబరు బిల్లుకు తాము కూడా మద్దతునివ్వవచ్చా అని ప్రశ్నిస్తున్నారు.

హోదా అంశాన్ని రాష్ట్ర ప్రయోజనాలంటున్నటీడీపీ, ఫిరాయింపు వ్యవహారం నైతిక విలువలతోపాటు, జాతీయ ప్రయోజనాల కోసమయిందున, తాము కూడా వైసీపీ ప్రైవేటు మెంబరు బిల్లుకు మద్దతునిస్తే తప్పేమిటని వాదిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ వాదనను తాము కూడా సమర్థిస్తే, ఇక మిత్రధర్మానికి అర్థం ఏముంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply