చెప్పినమాటకి ,చేసిన శపధం నిలబెట్టుకోడానికి ఏపీ విభజన తరువాత రాజకీయాలకి దూరమైన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారా?
సమైక్యాంధ్ర కోసం చేసిన పోరాటం తో ,ఓటమి తరువాత రాజకీయ అస్త్ర సన్యాసం చేయడం ఎందరో మనసుల్ని గెలిచింది .ఆ టైం లో ఆయనకి గట్టి ప్రత్యర్థి అయిన కేసీఆర్ సైతం లగడపాటి నిజమైన మగాడంటూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.నాటి ప్రతిజ్ఞలు,ఫలితంగా వచ్చిన ప్రశంసల్ని పక్కనపెట్టి మళ్లీ రాజకీయంలోకి అయన అడుగుపెడతారా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
ఇటీవల విజయవాడలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలిగించినపుడు అయన తన అసంతృప్తి వెళ్లగక్కారు.అయితే బహిరంగంగా బయటకి రాకుండా సుజనా చౌదరి ,సి.ఎం.రమేష్ లతో ఫోన్ లో మాట్లాడారు .తాజాగా విజయవాడలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జరిగిన ఓ సమావేశానికి అయన స్వయంగా హాజరవ్వడం ఆసక్తి రేపింది.ఆలయాలు ,మసీదులు ,దర్గాల తొలిగింపుకు వ్యతిరేకంగా తరాపేట కబ్రిస్థాన్ మసీదు ప్రాంగణంలో స్థానిక ముస్లిం పెద్దలతో అయన సమావేశమయ్యారు .వారితోపాటు ముస్లింయునైటెడ్ ఫ్రంట్,కాంగ్రెస్ ఎంఐఎం నాయకులు ప్రభుత్వ వైఖరిని ఆయనకు వివరించారు.వారి పోరాటానికి అండగా ఉంటానని లగడపాటి హామీ ఇచ్చారు .త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని మాటిచ్చారు.
తాజా పరిణామాలు లగడపాటి రీఎంట్రీ సన్నాహకాలన్నా అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇలాంటి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు.గడిచిన రెండేళ్లలో చాలాసార్లు అయన రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు,అనుచరులు హోర్డింగ్,బ్యానర్లు పెట్టడం …వాటిని అయన ఖండించడం చూశాం.ఈ సారి ఆయనే స్వయంగా ఓ అంశం మీద పోరాటానికి సిద్ధం కావడం మారుతున్న పరిస్థితికి అద్దం పడుతోంది.
లగడపాటి రాజకీయపునఃప్రవేశం గురించి వార్తలు వచ్చినప్పుడల్లా టీడీపీ వైపు మొగ్గవచ్చన్న ఊహాగానాలు వినిపించేవి .అందులో నిజానిజాలెలా వున్నా ఇప్పుడు అయన వైఖరి చూస్తుంటే భిన్నమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకొంటున్నట్టు అర్ధం అవుతోంది.ఇక ప్రత్యామ్నాయాలు కాంగ్రెస్..వైసీపీ …కాంగ్రెస్ కి లగడపాటి అవసరమున్నా ఆ పార్టీ కి దగ్గర అయితే విభజనతప్పులకు అయన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.అదంత తేలిక కాదు.ఇక వైసీపీ విషయానికి వస్తే జగన్ తో లగడపాటికి మంచి సంబంధాలు లేవు.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శత్రువులు ఎవరూ ఉండరనుకొన్నా ఒక ఒరలోరెండు కత్తులు ఇమడటం అంత తేలిక కాదు.కాకపోతే రాజకీయాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లు తరువాత ఉండవల్లి లాంటి వాళ్ళు బాగా ఆక్టివ్ అయ్యారు.
చేరబోయే పార్టీ గురించి ఎన్నికలకి ముందు ఆలోచిద్దాం ..అప్పటిదాకా ప్రభుత్వ వ్యతిరేక పంధాని అనుసరిద్దాం అనే వారి సంఖ్య పెరుగుతోంది .లగడపాటి కూడా ప్రస్తుతానికి అదే రూట్ ఫాలో అయ్యట్టు కన్పిస్తున్నారు ..అయితే పార్టీ విషయంలో నిర్ణయం కన్నా రీఎంట్రీ గురించి ప్రజలకి సరైన సమాధానం ఇవ్వాల్సిఉంటుంది.ఎంత బలమైన కారణంతో అయన రాజకీయాల నుంచి తప్పుకున్నారో ప్రజలకు తెలుసు.అంత కన్నా బలమైన కారణం,నేపధ్యం లేకుండా రాజకీయాల్లోకి వస్తే లగడపాటి కూడా రాజకీయ వేదికపై ఓ సామాన్య నాయకుడిగానే మిగిలిపోతారు.
పైగా విభజన వైఫల్యం తర్వాత లగడపాటి ,ఉండవల్లి మాటలకి ప్రజాక్షేత్రం లో విలువ తగ్గింది.ఎవరు ఔనన్నా కాదన్న ఇది పచ్చినిజం …విభజన నేపథ్యంలో సమైక్యవాదులకు హీరోలా కనిపించిన కిరణ్ Kumar రెడ్డి …దాన్ని అడ్డుకోలేకపోయి …పార్టీ పెడితే ఏమైందో తెలిసిందే ..అందుకే మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే మాత్రం లగడపాటి పూలబాటకి కాకుండా ముళ్ళదారికి సిద్ధమై ముందడుగు వేయాలి.