శాఖ మారే యోచనలో లక్ష్మారెడ్డి !!

Posted February 7, 2017

lakshma reddy is going to chanage the stream
తెలంగాణ ఆరోగ్య శాఖకు అనారోగ్యం వచ్చింది. ఎందుకంటే తరచూ ఆ శాఖలో ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. డాక్టర్ల వైఫల్యం మంత్రి లక్ష్మారెడ్డి మెడకు చుట్టుకుంటోంది. దీంతో ఆయన పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. ఒకవైపు నీలోఫర్ లో బాలింతల మృతి, మరోవైపు గాంధీలో చిన్నారి ప్రవళిక మృతి … ఈ సంఘటనలతో ఆయన మనస్తాపం చెందారట.

నీలోఫర్ లో అధికారికంగా ఐదుగురు బాలింతలు మృతి చెందారు. అనధికారికంగా చనిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం. ఈ ఘటనలో డాక్టర్ల వైఫల్యమే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు గాంధీ ఆస్పత్రిలో చిన్నారి ప్రవళిక మృతి విషయంలోనూ అదే జరిగింది. అప్పట్లో పురుగులు ఉన్న సెలైన్ ను ఎక్కించడం వల్లే.. చిన్నారి ఆరోగ్యం దెబ్బతిన్నది. రెండునెలల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి… ఆ పోరాటంలో ఓడిపోయింది. ఈ రెండు సంఘటనలతో లక్ష్మారెడ్డి తీవ్రంగా ఆవేదన చెందినట్టు సమాచారం.

ప్రభుత్వం ఎంత భరోసా ఇస్తున్నా… ప్రభుత్వాసుపత్రుల తీరు మారకపోవడంపై లక్ష్మారెడ్డి ఆగ్రహంగా ఉన్నారట. ఎంత చెప్పినా లాభం లేకపోవడంతో గాంధీ, నీలోఫర్ ఆస్పత్రుల డాక్టర్ల తీరుపై మండిపడ్డారట. ఇక ఈ శాఖలో పనిచేయడం తన వల్ల కాదని సీఎం కేసీఆర్ తోనూ చెప్పేశారట. శాఖ మార్చాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నట్టు సమాచారం.

మంత్రి లక్ష్మారెడ్డి వాదనతో సీఎం కేసీఆర్ కూడా ఏకీభవించారట. ప్రభుత్వాసుపత్రుల తీరును మార్చాలంటే మరొకరికి ఆ శాఖ ఇవ్వాలని ఆలోచిస్తున్నారని టాక్. అయితే నిర్ణయం తీసుకునేదాకా వేచి ఉండాలని లక్ష్మారెడ్డిని సీఎం కేసీఆర్ సముదాయించినట్టు తెలుస్తోంది.

SHARE