నేర్చుకోవడమే జీవితమంటే…

219
learning-is-life-socrates

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు.

ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.

సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది.

పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.

సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు.

జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు.

సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు.

సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు.

సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది.

శిష్యులు

”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు.

కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు.

నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది.

గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను.

ఇంకా నాజీవితంలో గంట సమయముంది.
.
అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.

శిష్యుల నోట్లో మాట రాలేదు.
Learning is life

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here