లోకేష్ @జనపథ్…

0
642

nara210 జనపథ్ …దేశవ్యాప్తంగా చిరపరిచితమైన నివాసం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసం…1 జనపథ్ ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పరిచితం కాబోతోన్న అడ్రస్…ఔను అందులోనే చినబాబు లోకేష్ ఢిల్లీ రాజకీయాల్ని అవపోసన పట్టబోతున్నాడు…చంద్రబాబు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. హస్తినలోని 1 జనపథ్ భవనం కూడా ముస్తాబవుతోంది…

లోకేష్ ఢిల్లీ బాట పడతారన్న వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఆయన్ను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు యోచించారు. కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలని కూడా భావించినట్టు సమాచారం…ఏమైందో ఏమో…వ్యూహాలు మారాయి.ఢిల్లీకి బదులు రాష్ట్ర రాజకీయాల్లోనే లోకేష్ బిజీ అయ్యారు. నాటి తరం నేతల కొడుకులతో నేటి తరం బ్రిగేడ్ తయారుచేస్తున్నారు…ఇపుడు జోరుగా సాగుతున్న ఆపరేషన్ ఆకర్ష్ కు గ్రౌండ్ వర్క్ ఆయనే ప్రిపేర్ చేస్తున్నారు…2014 ఎన్నికలకు ముందు కూడా గల్లా అరుణకుమారి వంటి సీనియర్ నేతల్ని పార్టీలోకి తీసుకురావడంలో లోకేష్ ఎంతో చొరవ చూపారు…అధికారం దక్కాక పార్టీ వ్యవహారాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.

లోకేష్ నెలకి రెండు మూడ్రోజులు ఢిల్లీలో ఉండి జాతీయ నాయకులతో పరిచయాలు పెంచుకోవాలని టీడీపీ ప్లాన్. కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహార నైపుణ్యం ఇందుకు స్ఫూర్తి అని కూడా కొన్ని పత్రికలు భాష్యం చెప్పాయి. నిజంగా ఆ పోలికతోటే లోకేష్ ఢిల్లీ వెళ్తుంటే మాత్రం అంతకు మించిన పొరపాటు ఉండదు…దేశం నేతలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కేటీఆర్, కవితల వాగ్ధాటి, సబ్జెక్టు ముందు లోకేష్ నిలవగలరా? కష్టం…విదేశాల్లో చదువుకున్నప్పటికీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రాధాన్యమున్న కాలంలో ఉన్నప్పటికీ జనంలో లోకేష్ అంత కంఫర్ట్ గా ఎప్పుడూ కనబడరు.

లోకేష్ పార్టీ సమావేశాల్లో నవ్వుతూ, చురుగ్గా కన్పిస్తారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అక్కడ అంతా తమ వాళ్లే…ఇంకా ముందుకెళ్లి చెప్పుకుంటే తమ దగ్గర పనిచేసేవాళ్ళే…కానీ ఢిల్లీలో అలావుండదు. ఆయన ఓ ముఖ్యమంత్రి కుమారుడు మాత్రమే…పైగా జాతీయ రాజకీయాల్లో అందరూ కాకలుతీరిన నేతలే…వయస్సు పరంగాను పెద్దవాళ్ళే…ఇలాంటి యువకులు వాళ్ళని రాజకీయాల పరంగా ఇంప్రెస్ చేయాలంటే అంతా తేలిక కాదు…పైగా అలా ప్రూవ్ చేసుకునే సందర్భాలు ఎప్పుడూ సంక్షోభాసమయాలే…ఒకప్పుడు చంద్రబాబుకి ఇలా పేరుతెచ్చిపెట్టింది ‘ఎన్టీఆర్-నాదెండ్ల ఆగస్ట్ సంక్షోభమే’. కానీ లోకేష్ ఇప్పటిదాకా అలాంటి సంక్షోభాల్ని ఎదుర్కొన్నది లేదు.

ఓ తండ్రిగా చంద్రబాబు కుమారుడు లోకేష్ కి ఇబ్బందులు రాకుండానే చూసుకొంటున్నారు. అంతా తానే అయి కొడుకు కోసం సాఫీగా సాగే రాజకీయ వేదిక తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ క్షణానికో రంగు మార్చే రాజకీయాలలో నిలకడ ఆశించడం అత్యాశే…

ఇదే తరహాలో రాహుల్ గాంధీ సమస్యల సుడిగుండంలో చిక్కుకు పోకుండా సోనియా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితమే ఆయన రాజకీయాల్లో రాణించలేకపోవడం. కష్టాలు, కడగండ్లు ఎదుర్కొంటేనే ఎవరేంటో నిరూపితమయ్యేది…ఎంతోకొంత నేర్చుకోగలిగేది…జనపథం, రాజకీయ రణక్షేత్రం తల్లిదండ్రులంత సున్నితంగా ఉండవు. అక్కడ బతికే వాళ్ళకి కాదు…గెలవడం కోసం చచ్చేంత పోరాటం చేసేవారికే స్థానం…

ఇక లోకేష్ ను నిశితంగా పరిశీలిస్తే…ఆయన ప్రసంగాలు చూస్తే ఓ విషయం సుస్పష్టం…పార్టీ వేదికలపై పనితీరు ఓకే…అంతా తనవారు అయినచోట నాయకత్వ స్ఫూర్తి రగిల్చే శక్తి ఉంది. కానీ ప్రజాక్షేత్రంలో కెళ్ళినపుడు…ఆయన ఇబ్బంది పడుతున్నారు. జనసామాన్యం పాల్గొనే బహిరంగ సభల్లో భావోద్వేగాలు పండించలేకపోతున్నారు…కొన్ని ఎన్నికల ప్రసంగాల్లో తడబడి సైకిలుకి ఓటేస్తే మీకు భవిష్యత్ ఉండదని కూడా చెప్పారు. తర్వాత తప్పు దిద్దుకున్నా…మాటల్లో ఆత్మవిశ్వాసం కొరవడింది…

ఇపుడు లోకేష్ ఢిల్లీ జనపథ్ కి వెళ్లడం తప్పో …ఒప్పో…అనితేల్చడం సరికాదు… అది తొందరపాటే అవుతుంది. కానీ లోకేష్ ఢిల్లీతో పాటు నిజమైన జన బాట పట్టాలి…ఓ ముఖ్యమంత్రి మనవడు…మరో ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా చదువుకున్న ఓ యువకుడిగా, నేర్చుకొనే ఓ నాయకుడిగా జనపథంలోకి వెళ్ళాలి…వారిని దగ్గరగా చూసి జీవితాన్ని, రాజకీయాన్ని నేర్చుకోవాలి.

  • కిరణ్ కుమార్

Leave a Reply