Posted [relativedate]
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడ్ని సామాన్యులకు దూరం చేస్తోంది టీటీడీ. సాధారణ భక్తుల కోసం ప్రవేశపెట్టిన 50 రూపాయల సుదర్శనం టిక్కెట్లకు మంగళం పాడింది. వాటి స్థానంలో 300 రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు ప్రవేశపెట్టింది. టీటీడీ చర్యపై భక్తుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అందరివాడైన ఆదిదేవుడ్ని కొందరివాడుగా మార్చేశారని విమర్శలు వస్తున్నాయి. సామాన్యుడికి బాగా అందుబాటు ధరల్లో ఉన్న సుదర్శనం టోకెన్లు ఎందుకు రద్దు చేశారన్న ప్రశ్నకు టీటీడీ దగ్గర సరైన సమాధానం లేదు.
సుదర్శనం టికెట్లపై టీటీడీ కుట్ర ఎప్పుడో మొదలైంది. మొదట టికెట్ల సంఖ్యలో కోత పెట్టారు. తర్వాత సోమ, మంగళ, బుధవారాల్లోనే జారీ చేశారు. చివరకు అసలుకే ఎసరు పెట్టారు. సుదర్శనం టికెట్ల సంఖ్య తగ్గుతున్న కొద్దీ.. 300 రూపాయల టికెట్లు పెరగడం టీటీడీ లాభాపేక్షకు నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారి ఆదాయానికి లోటు లేకపోయినా.. అధిక లాభాల కోసం ఆశపడుతూ.. టీటీడీ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తోందని చెబుతున్నారు. ధార్మిక సంస్థగా మనుగడ సాగించాల్సిన టీటీడీ.. భక్తుల సొమ్మును మింగేసే దళారిలా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే సాధారణ భక్తులకు శ్రీవారిని దూరం నుంచి చూపిస్తున్నారని, ఇప్పుడు సుదర్శనం టోకెన్ల రద్దుతో అసలు స్వామి దర్శనమే దుర్లభంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలుగురు సభ్యులున్న ఓ కుటుంబం రెండొందల రూపాయలతో శ్రీవారిని తనివితీరా దర్శించుకునేది. ఇప్పుడు 300 రూపాయల టికెట్ కొంటే.. పన్నెండు వందలు టీటీడీ సమర్పించుకోవాల్సిందే. సాధారణ మధ్యతరగతి కుటుంబం ఇంత బడ్జెట్ పెట్టి దేవుడ్ని ఎలా చూడగలుగుతుందని పలు ధార్మిక సంస్థలు కూడా టీటీడీని నిలదీస్తున్నాయి.