అమరావతిలో మహిళా పార్లమెంట్..

0
569

   mahila parliament amaravati andhra pradeshనవ్యాంధ్రప్రదేశ రాజధాని అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్‌ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మహిళా పార్లమెంటేరియన్ తొలి మహాసభలు వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి చివ‌రి వారంలో లేదా ఫిబ్ర‌వ‌రి తొలి వారంలో విజయవాడలో నిర్వ‌హింప చేసేందుకు స‌భాప‌తి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స‌న్నాహాలు చేస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా మహిళా పార్ల‌మెంట్ , శాసన సభ్యులు పాల్గొంటారు. ఈ సమావేశాలను కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్,భారతీయ ఛాత్ర సంసాద్ ఫౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌ల సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రాష్ట్ర ప్ర‌భుత్వం సంయిక్తంగా నిర్వహించనున్నాయి.

 పుణే లోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ మొత్తం కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌య‌ ప‌ర‌చ‌నుంది. గ‌త కొద్ది రోజులుగా ఈ అంశంపై దృష్టి సారించిన డాక్ట‌ర్ కోడెల పుష్క‌ర క్ర‌తువు ముగియ‌టంతో దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను వేగ‌వంతం చేసారు.  సమావేశాలకు చైర్మన్‌గా స్పీకర్  కోడెల శివ ప్రసాదరావు, చీఫ్ ప్యాట్రన్‌గా సీఎం చంద్రబాబు వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా అధ్యక్షురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుధా నారాయణమూర్తి ఆహ్వానించాలని యోచిస్తున్నారు.  సమావేశాల నిర్వాహణ పై   ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావుతో ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధి రాహుల్ వి. కరాడ్ ప్ర‌త్యేకంగా సమావేశమై చర్చించారు.

 మహారాష్ట్రలో రాహుల్‌కు చెందిన గ్రూప్‌ 79 విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఎంఐటీస్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ పేరుతో ప్రజా పాలన రంగంలో శిక్షణను ఇచ్చే విద్యా సంస్థ కూడా ఇందులో ఉంది. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఈ దిశగా చొరవ తీసుకుని స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌పై స‌మాలోచ‌న‌లు జ‌రుపుతుండ‌గా, యునెస్కో సైతం ఈ సదస్సులో భాగస్వామ్యం కాబోతుంది. ఇటువంటి మహిళా పార్లమెంట్‌ నిర్వహించడం ఇదే ప్రథమం కాగా దీనికి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా పార్లమెంటేరియన్లు, ప్రజాప్రతినిధులతో స‌హా  వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖులను ఆహ్వానించాల‌న్న‌ది స‌భాప‌తి యోచ‌న‌గా ఉంది. ఆంధ్రప్రదేశలోని పది వేల మంది చురుకైన విద్యార్థినులను,బాలికలను ఈ స‌ద‌స్సుకు  ఆహ్వ‌నించి వారిని ఉత్తేజితుల‌ను చేయ‌నున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు సిద్దం చేసిన కార్యాచ‌ర‌ణ‌ను అనుస‌రించి ‘మహిళా ప్రోత్సాహం – ప్రజాస్వామ్యం పటిష్టత’ అనే అంశంపై 3 రోజులు జరిగే మహాసభలో విభిన్న అంశాలు చ‌ర్చ‌కు రానున్నాయి.  తొలి రోజు‘మహిళా సాధికారిత- రాజకీయ సవాళ్లు’, వ్యక్తిత్వ నిర్మాణం – భవిష్యత్తు దార్శనికత, గురు శిష్యుల సంబంధాల పెంపు అన్న అంశాలపై చ‌ర్చిస్తుంది.  రెండవ రోజు మహిళల స్థితి – నిర్ణయాత్మకశక్తి,  మీకు మీరే సాటి అనే అంశాలపైన ప్రముఖుల ప్రసంగాలుంటాయి. మూడవ రోజు మహిళా సాధికారిత కోసం పరుగు నిర్వహించనున్నారు. ప్ర‌తి రోజూ సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేలా ఏర్పాట్లు ఉండాల‌ని స‌భాప‌తి భావిస్తుండ‌గా,  కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలంటే ప్ర‌భుత్వం పూర్తి స్ధాయిలో నిర్ణ‌యం తీసుకున్న రోజు నుండి త‌మ‌కు క‌నీసం నాలుగు నెల‌ల స‌మ‌యం కావాల‌ని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్ర‌తినిధులు స‌భాప‌తికి వివ‌రించ‌గా, త‌ద‌నుగుణంగా కార్యాచ‌ర‌ణ సిద్దం చేయాల‌ని శాస‌న‌స‌భ ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి స‌త్య‌న్నారాయ‌ణ‌, ఓఎస్‌డి గురుమూర్తిల‌ను ఆదేశించారు.

Leave a Reply