దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి అదో టైపు. ఆయనెప్పుడు బహిరంగంగా ఎన్ని గొప్పలు చెప్పినా.. నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. హైదరాబాద్ లో సహజంగా జరిగే అభివృద్ధే ఇక్కడ ప్రభావం చూపుతుంది తప్ప.. మల్లారెడ్డిని ప్రత్యేకంగా పనికట్టుకుని చేసిందేమీ లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇటీవలి కేసీఆర్ సర్వేల్లో కూడా మల్లారెడ్డికి అత్తెసరు మార్కులు వచ్చాయి. ఈసారి ఎంపీగా ఆయన గెలుపు కష్టమేనన్నది గులాబీ బాస్ కు ఉన్న ఇన్ఫర్మేషన్. దీంతో అభ్యర్థి మార్పు ఖాయమని ఊహాగానాలు వస్తున్నాయి. తాను దూర సందు లేదు మెడకో డోలన్నట్లు.. తనకే టికెట్ గ్యారెంటీ లేకపోతే.. కొడుక్కి ఎమ్మెల్యే సీటు కోసం మల్లారెడ్డి పైరవీలు చస్తున్నారు.
కానీ ఇక్కడ కూడా పెద్ద ట్విస్టుంది. కొడుకుతో పాటు అల్లుడు కూడా ఎమ్మెల్యే అవ్వాలని ఉత్సాహం చూపిస్తున్నారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే సీటుపై వీరిద్దరూ కన్నేశారు. కానీ ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి ఈటెలకు సన్నిహితుడు. ఆయన్ను కాదని కేసీఆర్ వీరికి టికెట్ ఇవ్వడం అనుమానమే. అసలు ఇంతకూ మల్లారెడ్డికి టికెట్ ఉంటుందో.. లేదో.