Posted [relativedate]
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. ఓవైపు టీడీపీ చాపకింద నీరులా పక్కా ప్రణాళికలతో దూసుకుపోతుంటే… వైసీపీ మాత్రం పరేషాన్ అవుతోంది. జగన్ సొంత చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి అసంతృప్తితో ఉండడమే అందుకు కారణం. దీంతో సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు షాకిస్తాయన్న ఆందోళన జగన్ లో వ్యక్తమవుతోంది.
వైఎస్ మనోహర్ రెడ్డి ప్రస్తుతం పులివెందుల మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఉన్నారు. ఆయన సతీమణి ప్రమీల… మున్సిపల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా కుటుంబంలోని కొందరి వ్యవహారశైలిపై మనోహర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారట. మున్సిపాలిటీలో తనకు తెలియకుండానే కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడం… వైస్ ఛైర్మన్ పదవి విషయంలో తన అభిప్రాయాన్ని తీసుకోకపోవడంతో ఆయన మనస్తాపం చెందారన్న వార్తలొస్తున్నాయి.
మనోహర్ రెడ్డిని బుజ్జగించడానికి వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రంగంలోకి దిగారట. అయితే మనోహర్ రెడ్డి మాత్రం వినే పరిస్థితి లేదట. అంతేకాదు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మనోహర్ రెడ్డి… టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేసుకున్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తగిలితే పరిస్థితి ఏంటని వైసీపీలో చర్చ జరుగుతోంది. సొంత జిల్లాలో చిన్నాన్నను గెలిపించుకోలేకపోతే జగన్ పై విమర్శల జడివాన కురవడం ఖాయమని వైసీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. మనోహర్ రెడ్డిని ఒప్పించకపోతే షాక్ తగలడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.