మళ్ళీ మావో జాడలు.. కర్నూల్ జిల్లాలో అరెస్ట్

  maoists kurnool district
చత్తీస్‌ఘడ్, జిల్లా పోలీసులు జా యింట్ ఆపరేషన్ చేపట్టి నలుగురు మావోయిస్టులను అరెస్టు చేయడంతో కర్నూలు జిల్లాలో సైతం మావోయిస్టుల  కదలికలు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాలో గాలేరు-నగరి కాలువ పనుల్లో భాగంగా అవుకు మండలంలో భారీ సొరంగం(టన్నెల్) పనులు  జరుగుతున్నాయి. ఇదే అదునుగా భావించిన చత్తీస్‌ఘడ్‌కు చెందిన మావోయిస్టులు టన్నెల్ నిర్మాణ పనుల్లో కూలీలుగా చేరి ఇక్కడి నుంచే కార్యకలాపాలు  నిర్వహించేవారు. ఈ విషయాన్ని చత్తీస్‌ఘడ్ రాష్ట్ర పోలీసులు పసిగట్టి కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణకు సమాచారం చేరవేశారు. దీంతో ఎస్పీ రవికృష్ణ  నేతృత్వంలో చత్తీస్‌ఘడ్, జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
రాత్రి పొద్దుపోయిన తరువాత టన్నెల్ క్యాంపునకు చేరుకుని చత్తీస్‌ఘడ్ నుంచి వచ్చిన 30 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అందులో 8 మంది అనుమానితులను రాత్రికి రాత్రే అవుకు పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. వారిలో నలుగురికి మావోల కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి వారిని వదిలేసి మిగిలిన నలుగురిని తెల్లవారుజామున కొలిమిగుండ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ పూర్తిస్థాయి విచారణ చేపట్టి మావోయిస్టులేనని నిర్ధారించుకుని  జిల్లా కేంద్రమైన కర్నూలుకు తరలించారు.
ఇదిలా ఉండగా ఆ నలుగురిలో ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు, అవుకు టనె్నల్ సిబ్బంది ఆ ప్రాంతంలో గాలించి కొన్ని గంటల వ్యవధిలోనే వారిని పట్టుకున్నట్లు సమాచారం. దీనిపై కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ చత్తీస్‌ఘడ్ పోలీసుల నుంచి తనకు అందిన సమాచారం మేరకు అవుకు ఎస్‌ఐ వెంకటరామిరెడ్డికి సమాచారం ఇచ్చి రెండు రోజులుగా అవుకు టనె్నల్ క్యాంపు కార్యాలయం చుట్టూ నిఘా ఏర్పాటు చేశామన్నారు.
SHARE