Posted [relativedate]
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దేశప్రధాని మోడీపై విమర్శల జడివాన కురుస్తోంది. ప్రతిపక్షాలు ఆయన తీరును ఏకి పారేస్తున్నాయి. పార్లమెంటులో మాట మాట్లాడని మోడీ….. బహిరంగసభల్లో మాత్రం గంటలకొద్దీ స్పీచులు ఇచ్చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు మోడీ తీరును తప్పుబడుతున్నారు. సభలో కావాలనే గందరగోళం సృష్టించి… సమాధానం ఇవ్వకుండా పారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోడీని విమర్శించడానికి ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోని నాయకుల్లో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒకరు. అలాంటి ఆయన నోట్ల రద్దు విషయంలోనూ మోడీని ప్రశ్నించారు. అంతేకాదు ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఓవైసీ మాట్లాడారు.
ఓవైసీ వాడిన నియంత అనే మాట కరెక్టేనంటున్నారు ఇతర పార్టీల నాయకులు. ఏ నాయకుడైనా ప్రజల కష్టాలను తగ్గించడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆయన మాత్రం ప్రజల కష్టాల పెంచడానికి పెద్ద నోట్లను రద్దు చేశారని మండిపడుతున్నారు. అందులో వాస్తవం కూడా లేకపోలేదు. ఇప్పటికీ నెలరోజులు గడిచిపోయింది. అయినా జనం మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రధాని మాత్రం మాటలతోనే సరిపెడుతున్నారు. కనుచూపుమేరలో ఈ కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. అందుకే మోడీపై ఈ రేంజ్ లో విమర్శలు పడుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు.