కొత్త రాజధానికి పుష్కర యాత్రికులు..

 minister narayana ap new secretariat coming watching pushkaralu citizensఏపీ సచివాలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. వెలగపూడిలో రాత్రీ పగలూ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెలగపూడిలోనూ ఉంటూ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ సంస్థలతో సమావేశమై ఎప్పడికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఓవైపు ప్రభుత్వం కృష్ణా పుష్కరాల నిర్వహణలో నిమగ్నమైనప్పటికీ ఎప్పటికప్పుడు సచివా లయ పనులను సమీక్షిస్తూ పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకుంటోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయంలో మంత్రులు, అధికారులు, సిబ్బంది చాం బర్లు సిద్ధమయ్యాయి.

ఇప్పటికే మంత్రులు ప్రారంభించిన ఐదు, రెండు బ్లాకుల్లో సకల సౌకర్యాలు కల్పించారు. ఒకటి, మూడు, నాలుగు బ్లాకులకు తుది మెరుగులు దిద్దు తున్నారు. ప్రతి భవనంలోనూ ఒకే విధమైన వసతులు కల్పిస్తున్నారు. విలువైన ఫర్నిచర్‌ను వినియోగిస్తున్నారు. మిలమిల మెరిసే టైల్స్, పాల వెలుగుల విద్యుత్ బల్బులతో హాళ్లు తళతళ మెరుస్తున్నాయి. ప్రతి ఫ్లోరుకి సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఫైట్స్ పైపులను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల క్యాబిన్లు, మంత్రుల పేషీలు, సందర్శకులు వేచి ఉండే గదులకు ఫర్నిచర్‌ను సిద్ధం చేశారు. అన్ని బ్లాకులకు ముందు తారు రోడ్లు వేస్తున్నారు.

డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. సచివాలయానికి సంబంధించి దాదాపు 45 శాఖలకు ఐదు భవనాలు నిర్మించారు. సీఎం, చీఫ్ సెక్రటరీ కార్యాలయాలు ఉండే మొదటి బ్లాకులో పనులు దాదాపు పూర్తయ్యాయి. తాగునీటి వసతి కల్పించాల్సి ఉంది. ఉద్యోగుల క్యాబిన్లు, ఉన్నతాధికారుల చాంబర్లలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, ఇంటర్నెట్ కనెక్షన ఇవ్వాల్సి ఉంది. ఓ వైపు కృష్ణా పుష్కరాలు జరుగుతున్నా సచివాలయ పనులకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూర్తయిన ఫ్లోర్లను ఈ నెలాఖరులోగా ఆయా శాఖల మంత్రులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

రాజధాని ప్రాంతంలో పుష్కర స్నానాలకు వస్తున్న యాత్రికులు సచివాలయాన్ని సందర్శించి, భవనాలను పరిశీలిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం కూడా పర్యాటక స్థలంగా మారింది. ఈనెల 24తో పుష్కరాలు పూర్తయిన తరువాత పూర్తిస్థాయిలో సచివాలయ పనులపై ప్రభుత్వం దృష్టి సారించి త్వరితగతిన పాలన అక్కడ నుంచి జరిగేలా చర్యలు తీసుకుంటోంది. 

SHARE