Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా.. అప్పట్లో ఫస్ట్ లేడీగా మంచి పేరే సంపాదించుకున్నారు. ముఖ్యంగా సోషల్ సర్వీస్, ఫ్యామిలీ వెల్ ఫేర్, ఒబామా హెల్త్ కేర్ వంటి అంశాల్లో ఆమెదే కీలకపాత్ర. అలాంటి మిషెల్ ఒబామా ఇప్పుడు ట్రంప్ పై యుద్ధానికి సై అంటున్నారు. స్కూలు పిల్లలకు పోషకాహారం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. మీకు ఏమైందసలు? పాఠశాలలో మన పిల్లలకు మంచి భోజనం ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకంత పక్షపాత ధోరణిలో ఉంటున్నారు?“ అని ప్రశ్నలు సంధిస్తూ ట్రంప్ సర్కార్ను మిషెల్ ఒబామా తీవ్రంగా తప్పుపట్టారు.
బాల్యదశలో ఊబకాయంపై పోరాటం కోసం ప్రైవేట్ పబ్లిక్ రంగాలు కలిసి ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ అయిన పార్టనర్ షిప్ ఫర్ హెల్దియర్ అనే ఎన్జీఓ నిర్వహించిన సదస్సుకు మిషెల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషెల్ ఒబామా మాట్లాడుతూ పాఠశాల భోజన పోషకాహార అవసరాలను కూడా ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంతదాకా అమలవుతున్న విధానానికి మార్పులు చేయటం ద్వారా పాఠశాలలో పిల్లలకు ఇచ్చే ఆహార విషయంలో నాణ్యత కోల్పోయే అవకాశముందని మిషెల్ ఆందోళన వ్యక్తంచేశారు.
పాఠశాలలో ఆరోగ్యకరమైన భోజన ప్రాముఖ్యతపై తల్లిదండ్రులు ఓ సారి ఆలోచించాలని సూచించారు. దీనిపై నేను నా పోరాటాన్ని కొనసాగిస్తా. ఈ సమస్యలపై నా అంకితభావం నిజమైనది అని తెలిపారు. అమెరికన్లకు మెరుగైన జీవితం అందించే విధంగానే అధ్యక్షుడి నిర్ణయాలు ఉండాలే తప్ప తనకు నచ్చిన ఆలోచనలు అమల్లో పెడతాను అన్నట్లుగా కాదని మిషెల్ వ్యాఖ్యానించారు.ఇప్పటికే ట్రంప్ తీరుపై పలువురు దుమ్మెత్తి పోస్తున్న సమయంలో.. మిషెల్ రంగంలోకి దిగితే.. ఆమెకు మద్దతు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.