ఫారిన్ కి సెల్ ఫోన్స్..కాకపోతే దొంగసరుకు …

0
454

 mobile thieves hyderabad export mobiles foreignమూడు కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ చూసినా సెల్‌ఫోన్ల దొంగలు రెచ్చిపోతున్నారు. రోజుకు పదుల సంఖ్యలో సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఆపిల్‌, ఐఫోన్స్‌ 6ఎస్‌, ప్లస్‌, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌-3 లాంటి తదితర ఖరీదైన ఫోన్లతోపాటు ట్యాబ్‌లను చాకచక్యంగా చోరీ చేస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలకు నగరంలోని సెల్‌ఫోన్ల ముఠాలు తోడవడంతో కొత్తతరహా నేరాలకు పాల్పడుతున్నారు. ఖరీదైన ఫోన్లు వాడే వారిని అనుసరించి ఎక్కడ ఏమరుపాటుగా ఉంటారో అక్కడ ఫోన్లను దొంగిలిస్తున్నారు.

పోలీసులు ట్రేస్‌ చేయకుండా ఐఎంఈఐ నెంబర్‌ ను కంప్యూటర్‌ సహాయంతో తొలగిస్తున్నారు. తక్కువ విలువ గల సెల్‌ఫోన్లను హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు, కర్నాటక రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఖరీదైన ఫోన్లను విదేశాలకు తరలిస్తున్నారు. నగరంలో ఇలాంటి తాజా ఘటనలు పోలీసుల్ని సైతం బెంబేలెత్తిస్తున్నాయి.కొన్ని ముఠాలు బస్సులు, రైళ్లలో ప్రయాణించే వారితోపాటు, నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్టాండ్‌లు, షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లను ఎంపిక చేసుకుంటాయి. ఈ క్రమంలో ముఠా సభ్యులు ఫోన్లున్న వారిని టార్గెట్‌ చేస్తారు.

మరికొన్ని ముఠాల సభ్యులు సాయంత్రం 5-9 గంటల మధ్యలో ఆపరేషన్‌ చేసే పనిలో నిమగమవుతున్నారు. కార్లలో వెళ్లే వారు, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేస్తున్న వారి వద్ద ఖరీదైన మొబైల్‌ ఫోన్‌ కనిపిస్తే చాలు ద్విచక్ర వాహనంతో వెంటబడతారు. రద్దీ ప్రాంతాలు, కూడళ్ల వద్దకు కారు చేరుకోగానే ముఠా సభ్యుల్లోని ఒకరు కారును ఢకొీట్టి అతనితో వాదనకు దిగుతాడు.

మరోవ్యక్తి మొబైల్‌ ఫోన్‌ వైపునకు వెళ్లి కారులో ఉన్న ఖరీదైన సెల్‌ఫోన్లను దొంగిలిస్తాడు. డ్రైవర్‌ సీటు పక్కకు వెళ్లి పెద్దగా అరుస్తారు. మాటల్లో పెట్టి పనిగానిస్తారు. బాధితులు తేరుకునే లోపే అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మీరట్‌కు చెందిన ఘరానా ముఠాలు నగరంలో అడ్డా వేశాయి. మీరట్‌లో ఉండే గ్యాంగ్‌ లీడర్‌ బురా ఆదేశాలతో నగరానికొచ్చి అనువైన లాడ్జిలో దిగుతారు. నగరంలో చోరీ చేసిన సెల్‌ఫోన్లను బురాకు అందజేయాలి. ఇలా రెండు మూడు గ్యాంగ్‌లను పంపించిన బురా ఆ టీంలకు లీడర్‌గా ఇమ్రాన్‌, నయీంలను నియమించాడు.

ఐఎంఈఐ నెంబర్‌ ద్వారా ఇండియాలో ఫోన్లను ట్రాప్‌ చేస్తారనే ఉద్దేశంతో విదేశాలకు పంపిస్తున్నారు. ఇందుకు నేపాల్‌లో ఉన్న నదీం అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిందితుడి సహాయంతో వేలాది సెల్‌ఫోన్లను ఆ దేశానికి పంపించారు. ఐదు రోజుల కిందట సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న ఐదుగురు నిందితులను సైఫాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన 65 మొబైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ఐదుగురిని మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు. మిగిలిన వారు తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ ముఠా సభ్యులు నగరంతోపాటు బెంగళూరు, ముంబయి, కర్నాటక రాష్ట్రాల్లో ఇదే తరహాలో చోరీలు చేశారు. గతంలో గాంధీనగర్‌ పోలీసులు సైతం సెల్‌ఫోన్లు తస్కరిస్తున్న ముఠాలను అరెస్టు చేశారు.

Leave a Reply