బాబు కి హ్యాండ్…జగన్ కి షేక్ హ్యాండ్?

Posted March 19, 2017

modi friendship with jagan
యూపీలో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన ఆనందంలో ఉబ్బిత‌బ్బిబ‌వుతున్న బీజేపీ అధినాయ‌క‌త్వం అప్పుడే తెలుగు రాష్ట్రాల‌పై క‌న్నేసింది. తెలంగాణ‌పై అమిత్ షా దృష్టి పెడితే… ఏపీపై మోడీ స్వ‌యంగా ఫోక‌స్ చేస్తున్నార‌ట‌. అందులో భాగంగా ఏపీలో స‌రికొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మొద‌ల‌వుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌గ‌న్ కు మోడీ నుంచి ఫ్రెండ్ షిప్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని టాక్.

ఏపీలో తెలుగుదేశం పార్టీకి మిత్ర‌ప‌క్షంగా బీజేపీ సొంతంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. టీడీపీ నీడ‌న ఉన్నంత కాలం పార్టీ బ‌ల‌ప‌డ‌డం క‌ష్ట‌మ‌న్న అంచనాకు మోడీ వ‌చ్చార‌ట‌. సైకిల్ కు టాటా చెప్పేసి కొత్త దోస్తుల‌ను చూసుకోవాల‌ని క‌మ‌ల‌నాథులు ఆరాట‌ప‌డుతున్నారని స‌మాచారం. అందులో భాగంగానే వైసీపీపై మోడీ క‌న్ను ప‌డింద‌ని చెబుతున్నారు. వైసీపీని క‌లుపుకుంటే… ఏపీలో బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా అవ‌త‌రించ‌వ‌చ్చ‌న్న‌ది బీజేపీ నాయ‌క‌త్వం ప్లాన్.

ప్ర‌స్తుతం జ‌గ‌న్.. కేసులతో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియ‌ని ప‌రిస్థితి. స‌రిగ్గా ఈ అంశాన్ని ఆయుధంగా రంగంలోకి దిగార‌ట మోడీ. ఎలాగూ జ‌గ‌న్ కు త‌మ అవ‌స‌రం ఎక్కువుంది కాబ‌ట్టి… వైసీపీని బీజేపీలో విలీనం చేయాల‌ని ప్ర‌తిపాదించార‌ని స‌మాచారం. విలీనం చేస్తే కేసుల నుంచి విముక్తి ల‌భిస్తుంద‌ని భ‌రోసా ఇచ్చార‌ట‌. అయితే అందుకు జ‌గ‌న్ ..ఎన్నిక‌ల ముందు పొత్తు పెట్టుకొని.. ఎన్నిక‌ల త‌ర్వాత విలీనం చేస్తామ‌ని చెప్పార‌ట‌. ఎన్నిక‌ల ముందు విలీనం చేస్తే.. త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న ముస్లింలు, క్రైస్త‌వులు దూర‌మైపోయే ప్ర‌మాద‌ముంద‌ని వైసీపీ అధినేత వివ‌రించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే బీజేపీ పెద్ద‌లు మాత్రం ఏ ఓట్లు కూడా దూరం కావ‌ని ప్ర‌తిస్పందించార‌ట‌. యూపీలో ఒక్క ముస్లింకు సీటివ్వ‌క‌పోయినా.. బంప‌ర్ మెజార్టీతో గెలిచామ‌ని… కాబ‌ట్టి ఏపీలోనూ అలా ఏం ఉండ‌ద‌ని మోడీ వ‌ర్గం చెప్పింద‌ని స‌మాచారం. అంటే ఎన్నిక‌ల ముందే వైసీపీని బీజేపీలో విలీనం చేయాల‌ని ఢిల్లీ పెద్ద‌లు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌.

బీజేపీ హైక‌మాండ్ నుంచి పిలుపురావ‌డం… అందులోనూ విలీనం విష‌యంలో ప‌ట్టుద‌ల‌గా ఉండ‌డం… కేసుల నుంచి విముక్తి ల‌భిస్తుంద‌నే ఆశ‌.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ లోనూ ఆలోచ‌న మొద‌లైంద‌ట‌. విలీనం విష‌యంపై మాట్లాడేందుకు కొంత టైం ఇవ్వాల‌ని బీజేపీ పెద్ద‌ల‌ను కోరినట్టు టాక్. అందుకు వారు కూడా అంగీకరించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

జ‌గ‌న్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో విలీనం దిశ‌గానే అడుగులేయొచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు క‌చ్చితంగా మారిపోనున్నాయి. చూడాలి మ‌రి … ఈ ఊహాగానాలు ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌వుతాయో?

SHARE