మోడీ దళిత మంత్రం వెనుక ?

0
222

 modi before low cast people
ఉద్రేకపూరిత ప్రసంగాలకు మోడీ పెట్టింది పేరు. ఉద్వేగ భరిత మాటల్లోనూ ఆయనకు ఆయనే సాటి. అందులోనూ విషయం కూడా ఉంటే ఇక చెప్పేదేముంది? అందుకే దళితులపై దాడి ఘటనల్లో స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దళితులను కాదు… నన్ను కాల్చండి అన్న మాటలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి.

నమో. అంటే నరేంద్రమోడీ. ఆత్మీయులు ప్రేమగా పిలుచుకునే పేరు. నిజంగానే బీజేపీకి ఓ మిసైల్ లాంటి నేత నరేంద్రమోడీ. మాటల్లో వేడి. చేతల్లో వడి. ఆయన వేసే ప్రతి అడుగులోనూ ఓ అంచనా. అందుకే ఇప్పుడు ప్రధాని మాటలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. మేధావులను సైతం ఆలోచింపజేస్తున్నాయి. మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లో జరిగిన ఓ ఘటనపై ఆయన స్పందించిన తీరుతో విపక్షానికి అస్త్రం లేకుండా పోయినట్లయింది. కాస్త విషయం మూలాల్లోకి వెళ్తే…ఆవును చంపారనే ఆరోపణలపై గిరి సోమనాథ్ జిల్లా ఉనా పట్టణంలో దళితులపై దాష్టీకానికి దిగారు. గోసంరక్షుల పేరిట మాటలకందని అమానుషానికి పాల్పడ్డారు.

నలుగురు యువకులు పశు చర్మాలను సమీప పట్టణంలోని మార్కెట్‌కు తరలిస్తుంటే, గోవధకు పాల్పడ్డారని వారిపై ఆరోపణలు చేశారు. ఇనుప చువ్వలు, కర్రలతో దాడిచేశారు. విపరీతంగా కొట్టారు. జీపుకు తాళ్లతో కట్టి పోలీస్ స్టేషన్‌దాకా ఈడ్చకుంటూ తీసుకెళ్లారు. అంతేకాదు…తాము చేసిన దురాగతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన దేశాన్ని కలచివేసింది. ఊహించినట్లుగానే దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో గుజరాత్ ప్రభుత్వ యంత్రాంగం 16 మంది నిందితులను అరెస్టు చేశామని ప్రకటించాల్సి వచ్చింది. ఇదొక్కటే కాదు… దీనికి రెండు నెలల క్రితం కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పుడు ఎఫ్‌ఐఆర్ అయినా నమోదు చేయలేదనే విమర్శలున్నాయి. సరిగ్గా ఇలాగే.. 2002 అక్టోబర్ 15న హర్యాణాలో ఐదుగురు దళిత యువకులను పోలీసుల కళ్లెదుటే కొట్టి చంపారు. పశు చర్మాలను మార్కెట్‌కు తీసుకెళ్తున్న వారిని గోవధకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వందలాది మంది దాడి చేశార వారిని పోలీస్ ఔట్‌పోస్టుకు తరలించినా వదలకుండా వెంటాడి మరీ చంపేశారు.

ఈ సంఘటనలతో మోడీ ప్రాభవానికి మసక ఏర్పడింది. ఆయన చెప్పేదొకటి…పార్టీ నేతలు, అనుయాయులు చేస్తున్నది మరొకటి అన్న విమర్శలు పెరిగాయి. దీనికి తోడు మరో ఘటన కూడా బీజేపీ దళితులకు వ్యతిరేకం, వారంటే చిన్నచూపు అన్న అభిప్రాయం ఏర్పడేందుకు దారి తీసింది. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతిపై ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకుడు చేసిన నీచమైన విమర్శలకు దిగాడు. దీంతో సహజంగానే బెహెన్ జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ కూడా తన తప్పు గ్రహించింది. ఆ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని ప్రకటించింది. గతానికి భిన్నంగా సదరు నేతపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్య కూడా తీసుకుంది. అయినా దళిత్ అంశం తెరపైకి రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. గుజరాత్ రాష్ట్రమైతే అట్టుడుకుతోంది.

ఆమ్రేలి పట్టణంలో నిరసనోద్యమం హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో ఒకరు చనిపోగా, ఉద్యమకారులు విసిరిన రాళ్ల దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. ఈ క్రమంలో దళితుల నిరసనోద్యమం సరికొత్త నిరసన రూపం తీసుకున్నది. ఇక పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా చూసేందుకు ఏకంగా మోడీయే రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ మహా సమ్మేళన్ లో దళితులను కాదు నన్ను కాల్చండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజాన్ని విభజించే రాజకీయాలు వదిలేయాలని సూచించారు. కొన్ని సంఘటనలతో సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు దళితులను పీడించి సమస్యలు సృష్టించాలనుకుంటున్నారని విమర్శించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. విమర్శలు సద్దుమణిగాయి. కొత్త చర్చకు తెర లేచింది.ప్రధాని పదవిలోకి వచ్చాక తొలిసారిగా తెలంగాణకు వచ్చారు నరేంద్రమోడీ. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ మహా సమ్మేళన్ లో పాల్గొన్నారు.

అందరిలోనూ ఉత్కంఠ. ఏం మాట్లాడుతారా? అని అంతా ఎదురు చూపులు. సరిగ్గా ఆ సమయాన్నే ఎంచుకున్నారు మోడీ. సద్వినియోగం చేసుకున్నారు. దాడి చేయాలనుంటే నాపై దాడి చేయండి.. నాపై తూటాలు పేల్చండి. నా దళిత సోదరులపై కాదు అన్నారు. దళితులపై గుత్తాధిపత్యం తమకే ఉందని కొందరు భ్రమపడుతున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ ను విమర్శించారు. దళితులను పీడించి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇక మీకేమైనా సమస్య ఉంటే నేరుగా తనపైనే దాడి చేయాలన్నారు. అంతే కాదు. ఈ ఆట బంద్ కావాల్సిందేనని స్పష్టం చేశారు.

అంతే కాదు… శాంతి, ఐక్యత, సద్భావన అనే మూలమంత్రాన్ని తాము ఎన్నడూ విస్మరించలేదన్నారు. విస్మరించబోమని చెప్పారు. దేశాభివృద్ధికి ఐక్యతే వెన్నెముక అని స్పష్టం చేశారు. కొన్ని ఘటనల వల్ల సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బలహీన, పీడిత వర్గాల రక్షణ, వారిని గౌరవించడం మన బాధ్యత అని స్పష్టం చేశారు. మనిషి, మనిషికి మధ్య అంతరం సరికాదని హితవు పలికిన ప్రధాని అందరూ ఐక్యతతో ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక దళితుల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు మోడీ. వేల ఏళ్లుగా మన సమాజంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి.

అంటరానితనం చొరబడిందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా ఈ లోపాలు ఉన్నాయని అంగీకరించాలన్నారు. మానవత్వానికే మచ్చల్లా ఇవి అక్కడక్కడ వికృత రూపంలో బయటపడుతూనే ఉన్నాయన్నారు. చివరకు దళితులను పీడించే హక్కు ఎవరిచ్చారంటూ గో రంరక్షక్ లను ప్రశ్నించారు. ఈ దెబ్బతో కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ సహా విపక్షాల అస్త్రాలను హైజాక్ చేసినట్లయింది. వాస్తవానికి గుజరాత్ ఘటనను చెప్పకనే చెప్పిన ప్రధాని విపక్షాల కన్నా కాస్త స్వరం పెంచి మాట్లాడారు. దారుణాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో తాను ఎంత నిజాయతీగా ఉన్నానో చూడండి అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. సర్కారు ఏర్పడి 27 నెలలుతోంది. ఇక హానీమూన్ ముగిసిందన్నది సుస్పస్టం. ఇక ఇప్పటి నుంచి తమ పాలనను అంచనా వేస్తారనే విషయం మోడీకి స్పష్టంగా తెలుసు. ఇది 2017 ఎన్నికలపై ప్రభావం చూపుతుందనీ తెలుసు. ఇక రాబోయేది ఎన్నికల కాలం. అంటే కొన్ని రాష్ట్రాల ఎన్నికలున్నాయి. యూపీ, పంజాబ్ తో పాటు తన సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో దళితులపై దాడుల అంశం తనకు అంత క్షేమం కాదని మోడీ భావించారు.

అందుకే గత ఎన్నికల్లో బీజేపీని ఒంటిచేతిపై గెలిపించారు. పదేళ్ల యూపీఏను మట్టి కరిపించారు. దేశ ప్రజల్లో కొత్త ఆశలు నింపారు. ఇప్పుడు వచ్చే ఏ ఎన్నికలైనా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ మొత్త ఆయనపైనే ఆధారపడి ఉంది. అందుకే ఆయన ఘాటుగా స్పందించారు. గత లోక్ సభ ఎన్నికల్లో అమోఘమైన ఫలితాలు రాబట్టిన బీజేపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అత్యంత అనివార్యం. ఢిల్లీ, బీహార్ లో మోడీ మానియా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ హవా నడుస్తోందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇకపోతే సంఖ్యా పరంగా పంజాబ్, గుజరాత్, యూపీల్లో దళితులు అత్యంత ప్రభావశీలురు. ఆ సామాజిక వర్గంపై వరుస దాడులు, అందునా తన హయాంలోనే వీటి సంఖ్య పెరిగిందన్న విమర్శల ప్రభావం ఓట్లపై పడుతుందన్నది సహజమైన అంచనా. దీన్ని ఊహించిన ప్రధాని నేరుగా మాట్లాడారు. తన పార్టీ శ్రేణులకు కూడా దిశా నిర్దేశం చేశారు.

ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా తట్టుకోగలరేమో కాని…వచ్చే ఏడాది చివరిలో జరగబోయే గుజరాత్ శాసనసభ ఎన్నికలలో ఓడిపోతే మాత్రం దాని ప్రభావం 2019 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలపైన పడి తీరుతుందనేది సుస్పష్టం. ఎన్‌డీఏ కూటమి కూలిపోయి కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మోడీతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా అనేక సమస్యలు చుట్టుముట్టక తప్పదు. పలు ఎన్‌కౌంటర్ కేసులు, ఇతర అల్లర్ల కేసులను తిరగదోడే ప్రమాదం పొంచిఉంది. ఇక పార్టీలో అత్యంత బలమైన నాయకుడైన నరేంద్ర మోడీ పేరు చెడిపోతే తిరిగి అంతటి బలమైన నాయకుడు లేడు. అందుకే తాను బద్ నాం కాకుండా ఉండాలనే వ్యూహం కూడా ప్రధాని మాటల వెనుక ఉంది.
………………..

Leave a Reply