Posted [relativedate]
యూపీ విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు విజయానందంలో మునిగితేలుతున్నాయి. విజయం ఊహించారేమో గానీ ఇంతటి విజయాన్ని కల గూడా కనలేదు.కానీ ఇంతటి విజయమే బీజేపీ కి తిప్పలు కూడా తెచ్చిపెడుతోంది.ఈ విజయోత్సవ సంబరాలు ముగిసిన కొద్ది రోజులకే ఓ సెగ బీజేపీ కి తగలొచ్చు.అదే అయోధ్య రామ మందిర వివాదం.యూపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు కొందరు రామమందిర అంశాన్ని ప్రస్తావించారు.తమకు సంపూర్ణ మెజారిటీ వస్తే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చేసారు.అసలు సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకి తగిన బలం వస్తుందన్న నమ్మకం లేకనే గెలిచినప్పుడు చూద్దాంలే అని అయోధ్య మందిర అంశాన్ని లేవనెత్తారు.
కానీ బీజేపీ శ్రేణులు,వారికి అండగా నిలిచిన సంఘ్ సానుభూతిపరులు ఊహించని ఫలితాలు వచ్చాయి.బీజేపీ అప్రతిహతంగా దూసుకెళ్లింది.ఓ రాజకీయ పార్టీ ప్రతినిధులుగా బీజేపీ నాయకులు ఎంతోకొంత సంయమనం పాటిస్తారేమో గానీ ఈ అవకాశం కోసమే కాచుకుని వున్న rss నేతలు, ఇతరత్రా మత సంస్థలు,స్వామీజీలు రానున్న రోజుల్లో అయోధ్య రామమందిర అంశాన్ని ముందుకు తేవడం ఖాయంగా కనిపిస్తోంది.అటు బీజేపీ విజయంతో రగిలిపోతున్న యూపీ లోని ప్రాంతీయ పార్టీలు సమాజ్ వాదీ,బహుజన్ సమాజ్ వాదీ,మోడీ ప్రభంజనంతో మసకబారిన ప్రతిష్టని తిరిగి తెచ్చుకోడానికి వేచి చూస్తున్న కాంగ్రెస్,కమ్యూనిస్ట్స్ కూడా అదే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే రామమందిర అంశం ముందుకొస్తుందో అప్పుడు మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం తీసుకురావచ్చని ఈ పార్టీలన్నీ భావిస్తున్నాయి.వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని హిందూ సంస్థలు ఓ వైపు,దానికి వ్యతిరేకంగా మిగిలిన వాళ్ళు సిద్ధమైతే మోడీకి అయోధ్య అంశం పెను సవాల్ అవుతుంది అనడంలో సందేహం లేదు.ఏదేమైనా ఒక్కోసారి గెలుపు కూడా తిప్పలు తెస్తుందన్న విషయం బీజేపీ విషయంలో త్వరలో నిర్ధారణ కాబోతోంది.