Posted [relativedate]
పెద్ద నోట్ల రద్దు వల్ల భవిష్యత్తులో పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. నిర్ణయానికి మద్దతు ప్రకటించిన దేశప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాను చేపట్టిన ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపడానికి తనకు మాటలు కరువయ్యాయని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు, కూలీలు, వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
నోట్ల రద్దు వల్ల కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, దాని ఫలాలు మున్ముందు అందుతాయన్నారు. నగదు రహిత దేశంగా మార్చేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ఇందుకు యువత ముందుకు రావాలని, దేశాన్ని అవినీతి రహిత, నగదు రహిత దేశంగా మార్చడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.