ఉప రాష్ట్ర‌ప‌తిగా హుంకుందేవ్?

 Posted March 25, 2017

Modi wants Hukmdev Narayan Yadav as vice-president of india
రాష్ట్ర‌పతి రేసులో అద్వానీ, జోషి లాంటి రాజ‌కీయ‌ దిగ్గ‌జాల‌ పేరు బలంగా వినిపిస్తున్న త‌రుణంలో… మ‌రి ఉప రాష్ట్ర‌ప‌తి ఎవ‌ర‌న్న‌ది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే వైస్ ప్రెసిడెంట్ కు సంబంధించి కొన్ని పేర్లను బీజేపీ అధిష్టానం ప‌రిశీలిస్తోంద‌ట‌. ఈ రేసులో చాలా త‌క్కువ మందే ఉన్నార‌ని టాక్.

ఉప‌రాష్ట్ర‌ప‌తి రేసులో వెంక‌య్య నాయుడు ఉన్నార‌ని మొద‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. కానీ ప్ర‌స్తుతం మోడీ కేబినెట్ లో కీల‌క‌మైన మంత్రిత్వ‌శాఖ‌ను నిర్వ‌ర్తిస్తున్న వెంక‌య్య‌ను వ‌దులుకోవ‌డానికి మోడీ ఇష్ట‌ప‌డక‌పోవ‌చ్చు. అందులోనూ వెంక‌య్య‌నాయుడు కూడా ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి మొగ్గు చూపే అవ‌కాశం లేద‌న్న‌ది ఆయ‌న స‌న్నిహితుల మాట‌.

వెంక‌య్య‌నాయుడును మిన‌హాయిస్తే… వైస్ ప్రెసిడెంట్ లిస్టులో బ‌లంగా వినిపిస్తున్న పేర్లు రెండే. అందులో ఒక‌రు హుకుందేవ్ నారాయ‌ణ్ యాద‌వ్ కాగా.. మ‌రొక‌రు క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న వాజూభాయ్ వాలా. బీహ‌ర్ రాష్ట్రానికి చెందిన హుకుందేవ్ రాజ‌కీయాల్లో చాలా సీనియ‌ర్ … ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. బీహార్ అసెంబ్లీకి కూడా ప‌లుసార్లు ప్రాతినిధ్యం వ‌హించారు. గ‌తంలో కేంద్ర‌మంత్రిగానూ ప‌నిచేశారు. యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈయ‌నకు మృదుస్వ‌భావిగా పేరుంది. పైగా ఆయ‌న పోటీలో ఉంటే బీహీర్ కు చెందిన లాలూ, నితీశ్ కూడా మ‌ద్ద‌తు ప‌లికే అవ‌కాశ‌ముంది. శివ‌సేన కూడా వ్య‌తిరేకించ‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి హుకుందేవ్ కు ఉప రాష్ట్ర‌ప‌తి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక వైస్ ప్రెసిడెంట్ రేసులో గ‌వ‌ర్న‌ర్ వాజుభాయ్ వాలా పేరు కూడా వినిపిస్తోంది. గుజరాత్ లో మోడీ సీఎంగా ప‌నిచేసిన కాలంలో ఆయ‌న ఆర్థిక మంత్రిగా ప‌నిచేశారు. స్పీక‌ర్ తో పాటు ప‌లు కీల‌క మంత్రిత్వ శాఖ‌లను నిర్వ‌హించిన అనుభ‌వం ఉంది. అన్నింటికి మించి మోడీకి స‌న్నిహితుడైన నేత‌గా గుర్తింపు పొందారు. అయితే ఈయ‌న గుజ‌రాత్ కు చెందిన నాయ‌కుడు కావ‌డ‌మే మైన‌స్ అంటున్నాయి బీజేపీ శ్రేణులు.

ప్ర‌ధాని మోడీతో పాటు పార్టీ చీఫ్ అమిత్ షా కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే. ఇప్ప‌టికే బీజేపీలో గుజ‌రాత్ ప్రాబ‌ల్యం పెరిగింద‌న్న విమ‌ర్శ ఉంది. కాబ‌ట్టి ఈ త‌రుణంలో అదే రాష్ట్రానికి చెందిన నాయ‌కుడికి ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఇచ్చేందుకు బీజేపీ అధినాయ‌క‌త్వం ఇష్ట‌ప‌డక‌పోవ‌చ్చు.

రాజ‌కీయ‌, కుల స‌మీక‌ర‌ణాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే హుకుందేవ్ కే ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాజుభాయ్ వాలా కంటే హుకుందేవ్ వైపే మోడీ స‌ర్కార్ మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. మ‌రి ఇందులో ఎంత‌మేర వాస్త‌వం ఉందో త్వ‌ర‌లోనే తేలిపోనుంది.

SHARE