ఆ అద్భుతం చూస్తాం ప్లీజ్…. ముక్త్యాల కోటపై బాబు కి లేఖ

0
782

 mukthyala kota letter babu

‘‘ గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి
విషయం: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముక్త్యాల కోటలోకి సందర్శకులను అనుమతించడానికి చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి

ఆర్యా..
1. కృష్ణా నదీ తీరంలోని ముక్త్యాల పుణ్యక్షేత్రం చారిత్రకంగా ప్రాధాన్యత కలిగినది. కృష్ణవేణమ్మ ఉత్తరవాహినిగా ప్రవహించే కేంద్రం అది. ఆ దివ్యక్షేత్రంలోని ముక్తేశ్వరస్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. ఆలయంలోని శిలాశాసనం, ఆలయ నిర్మాణ శైలి ఈ విషయాన్ని తెలియజేస్తాయి.
2. ఇదే ఆలయ ప్రాంగణంలో చెన్నకేశవ స్వామి ఆలయం కూడా వుంటుంది. ఇది చాలా అరుదైన అంశం. కృష్ణా నదికి అవతల మాత్రమే కనిపించే చెన్నకేశవ స్వామి.. ఇవతల ఒడ్డుకు రావడం వెనుక చాలా చారిత్రక నేపథ్యం వుంది.
3. ఈ ఆలయ ప్రాంగణం చెంతనే ముక్త్యాల జమీందారీ నివాస భవనం వుంటుంది. ఇది మూడు అంతస్తులలో, దాదాపు మూడొందల గదులతో చూడ ముచ్చటగా వుంటుంది. ఈ ముక్త్యాల కోటకు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలతో విడదీయలేని చారిత్రక సంబంధం వుంది. ఈ కోటలోకి ప్రవేశించడానికి సాధారణ ప్రజానీకానికి గతంలో అనుమతి వుండేది. కానీ రెండు, మూడేళ్లుగా అందులోకి ఎవరినీ అనుమతించడంలేదు. కె.సి.పి సిమెంటు సంస్థవారు దానిని తమ గెస్టుహౌసుగా ఉపయోగించుకుంటూ, సాధారణ ప్రజానీకాన్ని లోపలికి అనుమతించడంలేదు. కనీసం ద్వారం దగ్గర నిలబడి ఫోటో దిగడానికి కూడా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించడంలేదు.
4. ఈ కోటకు సంబంధించిన కొన్ని చారిత్రక అంశాలను మీ దృష్టికి తీసుకురావడం ద్వారా, కనీసం ఈ పుష్కరాల సమయంలో సాధారణ ప్రజానీకానికి ఈ కోటను దర్శించే అవకాశం లభిస్తుందనే ఆశతో, నమ్మకంతో మీకు ఈ విజ్ఞాపన చేస్తున్నాను.
5. నిరంతరం వరదలు లేదా కరువులతో అల్లాడుతున్న కృష్ణా తీర ప్రాంత ప్రజలకు సాగునీటి ప్రాజెక్టు అవసరాన్ని గుర్తించి, అందుకోసం అహరహం కృషి చేసినది ముక్త్యాల రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు. పులిచింతల ప్రాజెక్టు ఆయన రూపుదిద్దినదే. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును.. చిన్నది అని కొట్టిపారేయడంతో, తన సొంత ఖర్చులతో.. ఆ రోజుల్లోనే బహుశా అరవై లక్షల రూపాయలను వెచ్చించి, నందికొండ వద్ద అనువైన స్థలాన్ని అన్వేషించి, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు.
6. ముక్త్యాల కోట.. ఇంకా అనేక చారిత్రక ప్రాధాన్యతలను కలిగి వుంది. ఈ కోటలో 1919లో ఆర్ష రసాయనశాల నెలకొల్పి, ఆయుర్వేదంపై అనేక పరిశోధనలు చేశారు. అనేక ప్రామాణిక వైద్య గ్రంథాలను వెలువరించారు. ఆర్ష రసాయనశాల తరఫున ‘శ్రీ ధన్వంతరి’ పేరిట మాసపత్రిక కూడా వెలువడింది. యాభై సంవత్సరాలకు పైగా ఈ ప్రామాణిక మాసపత్రిక వెలువడింది. ఆర్ష రసాయనశాల తరఫునే ముక్త్యాల కోటలో క్యాన్సర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ కూడా నెలకొల్పారు. క్యాన్సర్ కు చికిత్స చేయడానికి ఈ కోటలోనే అనేక ప్రయోగాలు జరిగాయి.
7. ముక్త్యాల కోట.. సాహిత్యపరంగా కూడా చారిత్రక ప్రాధాన్యత కలిగి వుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అనేక సాహిత్య సభలు ముక్త్యాల కోటలో జరిగాయి.
8. ముక్త్యాల కోట.. బౌద్ధ సంస్కృతికి సంబంధించి కూడా ప్రాధాన్యత కలిగిన కేంద్రం. సమీపంలోని జగ్గయ్యపేట పట్టణంలో బుద్ధుడి 2,500 జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించి, ఆ సందర్భంగా ఒక సావనీర్ ను వెలువరించినది ముక్త్యాల రాజా వారే.
9. ముక్త్యాల రాజా వారికి.. బౌద్ధ మ్యూజియం ఏర్పాటు చేయాలనే సంకల్పం వుండేది. దానికోసం అనేక అపురూప కళాఖండాలను సేకరించారు. వారి కోరిక తీరలేదు. ఆ కళాఖండాలు కోటలో పడివున్నాయి. ముక్త్యాల కోటలో అనేక అపురూపమైన అముద్రిత గ్రంథాలు కూడా వున్నాయి. అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల అపురూప ఆస్తి. ఎవరి ప్రైవేటు ఆస్తి కాదు.
10. ముక్త్యాల రాజా చేసిన సేవల గురించి.. 1988లో ‘ముక్త్యాల దీపం’ అనే పుస్తకం వెలువడింది. దానిని దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుగారు ఆవిష్కరించారు.
ఈ అంశాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహించే పవిత్ర క్షేత్రమైన ముక్త్యాలలోని ఈ కోటలోకి.. కనీసం పుష్కరకాలంలోని పదిరోజులపాటు సామాన్య ప్రజానీకాన్ని అనుమతించి, నాటి చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య వైభవాన్ని మననం చేసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇట్లు,
భవదీయుడు
వాసిరెడ్డి వేణుగోపాల్

vasireddy.venugopal@gmail.com

Leave a Reply