Posted [relativedate]
యూపీ అధికార పార్టీలో పరిణామాలు డైలీ సీరియల్ లా కొనసాగుతున్నాయి. అంతా అయిపోయింది. హ్యాపీ ఎండింగ్ అనుకుంటున్న తరుణంలో మళ్లీ రచ్చ మొదలైంది. కథ మళ్లీ మొదటికొచ్చింది.
నాటకీయ పరిణామాల మధ్య సీఎం అఖిలేష్, ఎస్పీ అధికార ప్రతినిధి రాంగోపాల్ యాదవ్ జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ ను ఎన్నుకుంటూ ఈ సమావేశంలో నిర్ణయించారు. నేతాజీ ములాయం స్థానంలో అఖిలేశ్ పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ఎస్పీ అధ్యక్షుడిగా శివపాల్ యాదవ్ ను, పార్టీ నుంచి అమర్ సింగ్ ను తొలగిస్తూ కూడా ప్రతిపాదనలు చేశారు.
ఈ సమావేశం తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. సీఎం అఖిలేష్ వర్గీయులు లక్నోలోని పార్టీ తాళం వేశారు. అక్కడ శివపాల్ యాదవ్ నేమ్ ప్లేట్ ను తొలగించారు. ఊహించని పరిణామాలతో ములాయం ఒక్కసారిగా షాకయ్యారు. తనయుడు అఖిలేశ్ పై ములాయం చాలా కోపంగా ఉన్నారట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేని నిస్సహాయత. పేరుకు పార్టీ కర్త, కర్మ, క్రియ అయినా… ఇప్పుడు ప్రభుత్వంతో పాటు పార్టీ అఖిలేశ్ చేతుల్లోకి వచ్చేసింది. శివపాల్ యాదవ్, అమర్ సింగ్ పరిస్థితి ఏం బాగాలేదు. దీంతో ములాయం ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయారు. అయినప్పటికీ ఆయన శక్తికి మించి పోరాడాలని నిర్ణయంచుకున్నట్టు టాక్. ఈసీని కలిసే యోచనలో కూడా ములాయం ఉన్నట్టు సమాచారం. అయితే లాలూ ఎంత వారించినా.. అటు అఖిలేశ్, ఇటు ములాయం ఎవరూ తగ్గట్లేదట.
మొత్తానికి ఒకప్పుడు సమాజ్ వాదీని స్థాపించి యూపీ రాజకీయాలను మలుపు తిప్పిన ములాయం ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓడిపోతామని తెలిసి కూడా సొంత పార్టీపై పట్టుకోసం కొడుకుతో పోరాడుతున్నారు. రాజకీయ చదరంగం అంటే ఇదేనేమో?