Posted [relativedate]
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు మహాభారత,రామాయణ ఘట్టాల్ని మించి కనిపిస్తున్నాయి.అక్కడ సింహాసనం కోసం దాయాదులు యుద్ధం చేస్తే…ఇక్కడ సాక్షాత్తు తండ్రీకొడుకులు రాజకీయ రణరంగంలో తలపడుతున్నారు.ప్రస్తుత రాజకీయాలకి భిన్నంగా ములాయం …కొడుకు అఖిలేష్ కి వ్యతిరేకంగా తమ్ముడు శివపాల్ ని ప్రోత్సహిస్తున్నారు.ఎందుకిలా జరుగుతోందో తలపండిన తెల్లచొక్కాలకే అర్ధం కావడం లేదు.అయితే దాని వెనుక కారణం చూచాయగా తెలుస్తోంది.ములాయం కుటుంబ కలహాలే రాజకీయాలపై కూడా పడ్డాయి.
సమాజ్ వాదీ పార్టీలో ప్రస్తుత సంక్షోభానికి కారణం అఖిలేష్ భార్య డింపుల్ వైఖరి అని తొలుత భావించారు.కానీ ములాయం రెండో భార్య తాజా ముసలానికి కారణమని అఖిలేష్ వర్గం భావిస్తోంది.అఖిలేష్ అంటే పడని ఆమె ములాయం మీద ఒత్తిడి తెచ్చి,మరిదిని ముందు పెట్టి కధ నడిపిస్తున్నారని సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ బయటపెట్టారు.అంతే కాక ఆ ఉచ్చు నుంచి బయటపడి కొడుకు అఖిలేష్ కి అండగా నిలవాలని నేరుగా ములాయం కే లేఖ రాసాడు.ఈ పరిణామంతో ప్రజాస్వామ్యంలోనూ అంతఃపుర రాజకీయాలు నడుస్తూనే ఉన్న విషయం మరోసారి వెలుగు చూసింది.