Posted [relativedate]
సమాజ్ వాది లో ఉవ్వెత్తున ఎగిసిన సంక్షోభం చల్లారింది.కొడుకు మీద వేటేసిన ములాయం వర్గం తోక ముడిచింది .అఖిలేష్ ,రామ్ గోపాల్ యాదవ్ మీద ఆరేళ్ళు పాటు విధించిన సస్పెన్షన్ ఎత్తేస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు పరిణామాలు వేగంగా ,అనూహ్యంగా మారడం తో ములాయం వర్గానికి మరో అవకాశం లేకుండా పోయింది . అఖిలేష్ పెట్టిన సమావేశానికి దాదాపు 200 మంది ఎమ్మెల్యేలు రావడంతో ములాయం డిఫెన్స్ లో పడ్డారు . పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ రాయబారం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది .
యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ అధినేత, తన తండ్రి అయిన ములాయంసింగ్ యాదవ్ తో జరిపిన భేటీ ముగిసింది. నిన్నటి నుంచీ వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికలో తండ్రితో విభేదించిన అఖిలేష్ యాదవ్ తాను సొంతంగా అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో ములాయం ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తనను బలపరిచే ఎమ్మెల్యేలతో సమావేశమైన అఖిలేష్ ఆ సమావేశం మధ్యలో ములాయం ను కలుసుకునేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. దాదాపు గంట సేపు తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సమావేశ వివరాలు తెలియరాలేదు. తండ్రితో భేటీ అనంతరం అక్కడ ఉన్న విలేఖరులతో మాట్లాడకుండానే అఖిలేష్ వెళ్లిపోయారు. ములాయంతో భేటీలో అఖిలేష్‌తో పాటు శివపాల్ యాదవ్, అజాంఖాన్ కూడా పాల్గొన్నారు. ఇలా ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 200 నుంచి 229 మంది వరకూ అఖిలేష్ కు మద్దతు ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.