Posted November 29, 2016, 10:51 am
ఎంవీ మైసూరా రెడ్డి. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ వైఎస్ వ్యతిరేకిగా ముద్రపడ్డారాయన. అలాంటి మైసూరారెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయానికి టీడీపీలో చేరిపోయారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో ఇమడలేక.. వైసీపీలో చేరిపోయారు. మొదట్లో ఆయనకు కొంత ప్రాధాన్యం దక్కినా తర్వాత సీను మారింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆయనను వైసీపీ పక్కనబెట్టింది. దీంతో కొంతకాలంగా ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీలో ఉన్నా.. గెలిచినా.. ఓడినా… కడప జిల్లాలో ఇప్పటికీ ఆయన బలమైన నాయకుడే.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. బీటెక్ రవి ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఈయన సీఎం రమేశ్ కు అత్యంత సన్నిహితుడు. టీడీపీలో ప్రస్తుతం కీలక నాయకుడిగా ఉన్న సీఎం రమేశ్… బీటెక్ రవి గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఎర్రగుంట్లలో మైసూరారెడ్డితో ఆయన భేటీ అయ్యారు. టెక్ రవితో పాటు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేశ్ నాయుడు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీటెక్ రవి గెలుపు కోసం సహకరించాలని మైసూరాను సీఎం రమేశ్ కోరారట. అంతేకాదు టీడీపీలోకి రావాలని … వస్తే సముచిత గౌరవం కూడా ఇస్తామని భరోసా ఇచ్చారట.
సీఎం రమేశ్ ఆఫర్ కు అప్పటికప్పుడు మైసూరా రెడ్డి స్పందించకపోయినా… ఆయన దాదాపు సానుకూలంగానే ఉన్నారట. అధికార పార్టీలో చేరితేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చారట. దీనిపై త్వరలోనే మైసూరా స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.