ఇక తెలుగు తెరపై జీవిత చరిత్రలు..

0
749

all
ఇతర భాషలతో పోల్చితే తెలుగులో బయోపిక్ నిర్మాణం చాలా తక్కువే అని చెప్పొచ్చు. సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన వ్యక్తుల జీవితకథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే వుంటాయి. కొందరి గాథలు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే, మరికొందరి జీవితాలు వారి ఉత్థానపతనాల్ని తెలియ చెపుతాయి. హిందీలో గత ఏడాది నుంచి బయోపిక్‌ల జోరు కొనసాగుతుండగా…ప్రస్తుతం తెలుగులో కూడా ఆ ట్రెండ్ మొదలైంది. గౌతమీపుత్రశాతకర్ణి, హథీరామ్‌బాబా జీవితకథలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. ఈ కోవలోనే మరికొందరి జీవితకథలు వెండితెర దృశ్యమానం కావడానికి సిద్ధమవుతున్నాయి. ఆ చిత్రాలపై ప్రత్యేక కథనమిది…

NBK-Gautami-Putra-Satakarni-

శాతవాహన చక్రవర్తుల్లో అత్యంత పరాక్రమశీలియైన గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి రూపొందుతోంది. ఇప్పటివరకు మానవీయ ఇతివృత్తాలతో సినిమాలు తీసిన దర్శకుడు క్రిష్… బాలకృష్ణ వందో చిత్రానికి చారిత్రక ఇతివృకథాంశాన్ని ఎంచుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 70కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. మొరాకోని ప్రఖ్యాత లొకేషన్లలో ఇటీవలే భారీ పోరాట ఘట్టాల చిత్రీకరణతో తొలి షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఒకటో శతాబ్దం నాటి కాలమాన పరిస్థితుల్ని కళ్లకుకట్టినట్లుగా ఆవిష్కరిస్తూ క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చిత్రబృందం చెబుతోంది. తెలంగాణలోని కోటిలింగాల, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిని రాజధానిగా చేసుకొని అఖండ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం క్రింద ఏలిన గౌతమీపుత్రశాతకర్ణి అసమాన పోరాట పరాక్రమాలు కథే ఇదని దర్శకుడు క్రిష్ చెబుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

nag................

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుని ప్రియభక్తుడైన హథీరామ్ బాబా జీవితకథతో నమో వెంకటేశాయ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు 600ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయిబాబ వంటి భక్తిరస చిత్రాల తర్వాత నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. దివంగత ఎన్టీఆర్ నటించిన వెంకటేశ్వర మహాత్యం చిత్రంలోని ద్వితీయార్థంలో హథీరామ్‌బాబా గాథను కొంతమేర ఆవిష్కరించారు. ఆ సినిమాలో హాథీరామ్‌బాబాగా చిత్తూరు నాగయ్య నటించారు. తాజాగా హథీరామ్ జీవిత వృత్తాంతాన్ని తీసుకొని పూర్తిస్థాయి చిత్రాన్ని రూపొందించడానికి రాఘవేంద్రరావు ముందుకొచ్చారు.ఉత్తర భారతం నుంచి వచ్చిన హాథీరామ్‌బాబా శ్రీవెంకటేశ్వరుడి అపరభక్తుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వెంకటేశ్వరుడితో కలిసి పాచికలు ఆడేవాడని చారిత్రక కథనాలున్నాయి. ఏడుకొండలవాడిపై తన భక్తిప్రపత్తుల్ని నిరూపించుకోవడానికి నాటి పాలకుల నుంచి హథీరామ్ ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొన్ని విజయుడయ్యాడు. భక్తిరసంతో పాటు కావాల్సినన్ని కమర్షియల్ హంగులున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కీరవాణి స్వరాలను సమకూర్చుతున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

vanga

ఎనభయ్యవ దశకంలో విజయవాడ రాజకీయాల్ని శాసించిన వంగవీటి మోహనరంగ జీవితకథతో రామ్‌గోపాల్‌వర్మ వంగవీటి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సున్నితమైన రాజకీయ అంశాలున్న చిత్రం కావడంతో నిర్మాణం నుంచే ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. రౌడీయిజం అసలు రూపాన్ని, దానిని ప్రేరేపించే శక్తుల్ని విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు చాలా దగ్గరగా చూశాను. చలసాని వెంకటరత్నంను వంగవీటి రాధా చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం…వంగవీటి రంగాను చంపడంతో ఎలా అంతమైందో వంగవీటి చిత్రంలో చూపించబోతున్నాను. 30ఏళ్ల క్రితం నాటి విజయవాడ వాతావరణాన్ని ఈ సినిమాలో పునఃసృష్టించే ప్రయత్నం చేస్తున్నాను అంటూ వర్మ ఈ సినిమా గురించి ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ సినిమా విషయంలో తలెత్తె వివాదాల్ని దృష్టిలో వుంచుకొని చిత్రీకరణను రహస్యంగా పూర్తిచేశారని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం.
…….

Leave a Reply