Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని కుటుంబంకు చెందిన సత్యభూషణ రావు మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి కారణంగా నిన్న జరగాల్సిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్ర ఆడియో వేడుకను రద్దు చేయడం జరిగింది. నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్‌లు జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను నాగార్జున నిర్మిస్తున్న విషయం తెల్సిందే. కుటుంబంలో నెలకొన్న విషాదం కారణంగా ఆడియో వేడుక రద్దు చేస్తున్నట్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక సినిమాను కూడా ఈనెల 26న విడుదల చేయకుండా వాయిదా వేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాడు.
ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడ్డ కారణంగా సినిమాను కూడా ఒక వారం లేదా రెండు వారాల ఆలస్యంగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని, దాంతో ఇతర సినిమాలు ఆ తేదీలో విడుదలకు సిద్దం అవుతున్నాయంటూ వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో నాగార్జున ఆ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆడియో విడుదల కార్యక్రమం రద్దు అయినా సినిమాను మాత్రం అనుకున్న తేదీకి తీసుకు వస్తామని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో ఆడియో వేడుక ఇక ఉండదని, నేరుగా పాటలను మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే ఆడియోపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు అనూహ్య స్పందన వస్తుంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.