నాగార్జున నవమన్మధుడు..మాత్రమేనా?

0
623

king
ముక్కంటి మీద పూలబాణమేసి ఆ ఆగ్రహజ్వాలల్లో మాడి మసైపోయాడు నాటి మన్మధుడు.. భౌతిక రూపం లేకపోయినా పరువాల ప్రాయం నుంచి పండు ముదుసలి దాకా మనస్సులో ఆ మన్మధుడు గిలిగినతలు పెడుతూనే వున్నాడు. కానీ ఆ మన్మథుడికే రూపం ఉంటే ఎలా ఉంటాడు? దేవుడికి కూడా అలాంటి తమాషా ఆలోచన వచ్చి నవమన్మధుడిని నాగార్జున రూపంలో సృష్టించాడేమో! నాగార్జున అనగానే నవమన్మధుడు, అందగాడు, మహిళా అభిమానుల్ని చూపులతో మెస్మరైజ్ చేసే సమ్మోహన శక్తి.. ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటారు. కానీ నాగార్జున నవమన్మధుడనేది ఓ ఇంటి అడ్రస్ మాత్రమే.. ఆ ఇంట్లోకెళితే కదా అందులోని కళాఖండాలు చూసేది.. అక్కడి ప్రశాంతవాతావరణాన్ని అనుభవించేది.. అనుభూతి చెందేది..

na

‘విక్రమ్’ సినిమా ద్వారా నాగార్జున తెలుగు తెరకు పరిచయమైనపుడు.. ఏ టాలెంట్ లేకపోయినా సినీనేపథ్యం వున్నా కుటుంబం నుంచి మరో హీరోని పట్టుకొచ్చారు అన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమైంది. అప్పటి సినిమాల్లో అయన హావభావాలు చూస్తే అంతకు మించి సదభిప్రాయం కలగదు. డబ్బులో పెరిగి.. అమెరికాలో చదివి.. ఇలాంటి విమర్శలొస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? అక్కడి నుంచి పారైనపోతారు లేదా సినీరంగ పరిస్థితులకు తగ్గట్టు మారైనపోతారు.. నాగ్ ఆ రెండు చేయలేదు. తనతో బాటు తెలుగు సినీరంగ ఎదుగుదలకు పనికొచ్చే ప్రయోగాల బాటపట్టారు. శివ, గీతాంజలి వచ్చాయి. అయన స్టార్ అయ్యాడు కానీ ప్రయోగాల తర్వాత కూడా వరస వైఫల్యాలు తప్పలేదు. ఇక అయన సినీరంగాన్ని పదిలిపెడతాడని కూడా ఓ దశలో రూమర్లు వచ్చాయి. కానీ నాగ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సారి చేసే ప్రయోగాలు తానూ టార్గెట్ చేస్తున్న ప్రేక్షకక్షేత్రాన్ని దృష్టిలో వుంచుకొని ముందుకెళ్లారు. తెలుగు సినీచరిత్రలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా నిలిచారు. ఇదంతా మారిన మారుతున్న పరిస్థితులకు తగినట్టు తనను తాను మల్చుకున్న నాగార్జున సక్సెస్ స్టోరీ..

king-nagarjuna

ఒక్క సినీరంగంలోనే కాదు నిజజీవితంలో కూడా అయనలో అదే మార్పు. ఒకప్పుడు సిగ్గుగా కనిపించే నాగ్ ప్రస్తుతం ఏ అంశం మీదైనా నిర్భీతిగా మాట్లాడగలరు. తెలిసిన విషయాన్ని బ్రహ్మండంగా చెప్పగలరు. తెలియాల్సిన విషయాన్నీ అడిగి నేర్చుకోగలరు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఆయనలోని ఈ కోణాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసింది. ఇదంతా చుట్టూ వున్న మానసిక అడ్డుగోడల్ని ఛేదించడం వల్లే సాధ్యమైందని అయన అప్పుడప్పుడు చెప్తారు. మాట విషయంలో అక్కినేని నాగేశ్వరరావు కాస్తంత కటువుగా, వ్యంగ్యంగా మాట్లాడతారని ఓ టాక్. కానీ నాగార్జున మాట్లాడుతుంటే మనలో ఒకడు.. మనింటి మనిషి మాట్లాడినట్టే ఉంటుంది.

ఇక వ్యాపార రంగంలోనూ అయన విజయాలు అందరికీ తెలిసిందే. సినీరంగంలో ఉంటూనే నాగ్ రియల్ ఎస్టేట్, టీవీ రంగాల్లోనూ విజయం సాధించారు. ఇక పిల్లల ప్రేమ విషయం బయటకి వచ్చినప్పుడు ఏ తండ్రి అయినా కంగారు పడటం సహజం. కానీ నాగ్ తన జీవిత అనుభవాన్ని దృష్టిలో వుంచుకొని వచ్చే పరిణామాల్ని పరిస్థితుల్ని వారికి వివరించారు. నిర్ణయం వాళ్లకే వదిలేశారు. సగటు జీవులు జీవితం తిరగబడిపోయినంత చేసే వ్యవహారాన్ని సులువుగా అధిగమించారు.

akkineni

ఇదంతా చూస్తుంటే.. నాగ్ జీవితాన్ని పరిశీలిస్తుంటే ఓ విషయం అర్ధమవుతుంది. అయన దృష్టి గమ్యం మీద మాత్రమే ఉండదు.. సాగుతున్న ప్రయాణం మీద.. దాన్ని ఆస్వాదించే తీరు మీద కూడా ఉంటుంది. అందుకే నవమన్మధుడు సదా హ్యాపీ. మన నవమన్మధుడు చెరగని చిరునవ్వుతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.. మీ తెలుగు బుల్లెట్ 

nag

Leave a Reply