Posted [relativedate]
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉగాది రోజున జరగనుందా? పండుగనాడే మార్పులు- చేర్పులు జరగనున్నాయా? చంద్రబాబు కేబినెట్లోకి లోకేశ్ గ్రాండ్ ఎంట్రీ అదే రోజు జరగనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది టీడీపీ వర్గాల నుంచి….!
చంద్రబాబు మంత్రివర్గంలోకి లోకేశ్ ఎంట్రీ ఎప్పుడో ఖరారైందని ప్రచారం జరుగుతోంది. అయితే మంచి ముహూర్తం కోసమే ఇన్నాళ్లూ ఆగుతూ వచ్చారట. అంతేకాకుండా లోకేశ్ కు మంత్రిపదవి ఇస్తే.. ఆయనతో పాటు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కూడా చేయాల్సిందే. మార్పులు- చేర్పులు చేయాలంటే అన్నీ సమీకరణలు లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టే బాబు కేబినెట్ లోకి లోకేశ్ ను తీసుకోవడం… వాయిదా పడుతూ వస్తోందన్న వాదన వినిపిస్తోంది. అందుకే ఇన్నాళ్లూ ఆలస్యమైందని టాక్.
త్వరలోనే ఎమ్మెల్సీ బరిలోకి లోకేశ్ దిగబోతున్నారు. ఈనెల 28న నామినేషన్ వేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ ఎన్నికలు మార్చి 17న జరగబోతున్నాయి. ఆయన ఏ స్థానం నుంచి దిగినా… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గెలుపు లాంఛనమేనన్నది అందరూ చెబుతున్న మాట. దీంతో యువనేత ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత …. మంత్రివర్గంలోకి తీసుకోవడం కూడా మంచిదేనని చంద్రబాబు యోచిస్తున్నారట. అందుకే ఈనెల 19న మంచి ముహూర్తం ఉన్నా…. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణను వాయిదా వేశారట.
బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం.. ఉగాది పండుగరోజు అయితే దివ్యమైన ముహూర్తం ఉందని పురోహితులు కూడా చంద్రబాబుకు సూచించారట. ఇటు లోకేశ్ తో పాటు మంత్రివర్గంలో ఎవరికి చోటు ఇవ్వాలో.. ఎవరిని తొలగించాలో కూడా ఏపీ సీఎం ఒక నిర్ణయానికి కూడా వచ్చేశారట. లోకేశ్ మినిస్టర్ కావడానికి ఇంతకంటే మంచితరుణం ఉండదని ఆయన భావిస్తున్నారట. అంటే ఈసారి రాబోతున్న ఉగాది నారా కుటుంబానికి వెరీ వెరీ స్పెషల్ గా కానుందన్న మాట !!!