Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఐటీ రంగంలో తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటారు.అందులోను ఆంధ్రప్రదేశ్ నిపుణుల నెంబర్ ఇంకాస్త ఎక్కువ.అయినా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్ధి అనేది ఇప్పటికీ మాట గానే మిగిలిపోయింది.విశాఖ,తిరుపతి కేంద్రంగా ఐటీ అభివృద్ధి అంటూ చంద్రబాబు సర్కార్ గతంలో చేసిన ప్రకటనలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు.ఇది ప్రభుత్వ వైఫల్యం అని ఓ విమర్శకి పరిమితమై వూరుకునేంత చిన్న విషయం కాదు. హైదరాబాద్ ని ఐటీ రంగంలో డెవలప్ చేసిన బాబు ఇక్కడెందుకు తడబడుతున్నారంటే సవాలక్ష కారణాలు.అందులో ముఖ్యమైనది అసలు ఐటీ రంగ అభివృద్ధి వేగం,కొత్త ప్రాంతాల్లో అభివృద్ధికి వున్న అవకాశాలు తగ్గిపోయాయి.ఆటోమేషన్ వల్ల అసలు ఆ రంగంలో సాదాసీదా ఉద్యోగాలకు డిమాండ్ కూడా తగ్గిపోయింది.ఇక ఈ రంగం మన దేశం ఎక్కువగా ఆధారపడే అమెరికా లో అధ్యక్షుడు ట్రంప్ వైఖరి గురించి చెప్పక్కర్లేదు.ఇన్ని ప్రతికూలతల మధ్య ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్న ఏపీ లో ఐటీ ని ప్రమోట్ చేయడమంటే కత్తి మీద సామే.
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గన్నవరంలోని మేధా టవర్స్ లో నేడు ఏడు ఐటీ కంపెనీలని ప్రారంభించారు.ఈ కంపెనీల ద్వారా 1600 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా.భవిష్యత్ లో ఏపీ మొత్తం మీద ఈ సంఖ్య 2 లక్షలకు చేరుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.కానీ అది చెప్పినంత తేలిగ్గాదు.పైగా లోకేష్ ఏపీ లో ఐటీ డ్రైవర్ సీట్ ఎక్కాక వచ్చిన తొలి మలుపు ఇది.అంతకముందు విశాఖ కేంద్రంగా ఐటీ అనుకున్నది కాస్త ఇప్పుడు విజయవాడ వైపు మళ్లింది.భవిష్యత్ లో ఐటీ రూట్ గమ్యం ఇదే అని లోకేష్ క్లియర్ గా చెప్పలేకపోయారు.అదేదో చెప్పేస్తే గానీ వచ్చే కంపెనీల సంగతి ఎలా వున్నా రావాలనుకునే ఉద్యోగులకి ఓ స్పష్టత వస్తుంది.వాళ్ళు విశాఖ బస్సు ఎక్కాలో విజయవాడ బస్సు ఎక్కాలో తేల్చుకుంటారు.