శంకర గా వస్తున్న నారా వారబ్బాయి..

 nara rohit new movie shankara movieనారా రోహిత్ హీరోగా న‌టించిన `శంక‌ర‌` సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. రెజీనా నాయిక‌. తాతినేని స‌త్య ప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ లీలా మూవీస్ ప‌తాకంపై రూపొందింది. జె.ఆర్‌.మీడియా ప్రై.లిమిటెడ్‌తో క‌లిసి ఆర్.వి.చంద్ర‌మౌళి ప్ర‌సాద్ (కిన్ను) నిర్మించారు. ఎమ్వీ రావు స‌మ‌ర్పించారు. త‌మిళంలో చ‌క్క‌టి విజ‌యాన్ని సొంతం చేసుకున్న `మౌన‌గురు` చిత్రానికి రీమేక్ ఇది. అక్క‌డ అరుళ్‌నిధి హీరోగా న‌టించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర  కాసుల స‌వ్వ‌డి చేసింది. ఈ స‌బ్జెక్ట్ కు యూనివ‌ర్శ‌ల్ యాక్సెప్టెన్స్ ఉండ‌టంతో ఎ.ఆర్‌.మురుగ‌దాస్ చిన్న చిన్న మార్పులు చేసి హిందీలోనూ తెర‌కెక్కించారు. అదే సోనాక్షి సిన్హా న‌టించిన `అకీరా`.
 `శంక‌ర‌` చిత్రం గురించి నిర్మాత ఆర్‌.వి. చంద్ర‌మౌళి ప్ర‌సాద్ (కిన్ను) మాట్లాడుతూ “వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోటుపాట్లు శంక‌ర అనే కుర్రాడికి న‌చ్చ‌వు. వాటిని ప్ర‌తిఘ‌టించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌శ్నించే కొడుకును చూసి అత‌న్ని క‌న్న త‌ల్లి,  సోద‌రుడు బాధ‌ప‌డ‌తారు. దాంతో అత‌న్ని సొంతూరు నెల్లూరు నుంచి విజ‌య‌వాడ‌కు పంపుతారు. మ‌ధ్య‌లో ఓ కారు యాక్సిడెంట్ జ‌రుగుతుంది. ప్ర‌మాదానికి గుర‌యిన వ్య‌క్తిని కాపాడ‌టానికి కొంద‌రు ముందుకొస్తారు.
అయితే వారు ర‌క్షించ‌డానికి బ‌దులు చంపేస్తారు. ఆ క్రైమ్‌లో శంక‌ర ఇరుక్కుంటాడు. అది ఎలా జ‌రిగింది? ఇంత‌కీ ప్ర‌మాదానికి గుర‌యింది ఎవరు?  కాపాడ‌టానికి ముందుకొచ్చి కాపాడ‌కుండా చంపేసిన వారు  ఎవ‌రు? శ‌ంక‌ర నిర్దోషి అని నిరూపించుకున్నాడా?  లేదా? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌న్నిటికీ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధాన‌మే మా `శంక‌ర‌`. సాయికార్తిక్ మంచి సంగీతాన్నిచ్చారు. ట్యూన్ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది“ అని అన్నారు.
చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎమ్వీ రావు మాట్లాడుతూ “ సెప్టెంబ‌ర్ 16న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చుతుంది. నారా రోహిత్ కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుంది“ అని చెప్పారు. 
జాన్ విజ‌య్‌, రాజీవ్ క‌న‌కాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి కెమెరా:  టి.సురేందర్‌ రెడ్డి, ఎడిట‌ర్‌:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు.
SHARE