Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ.. గవర్నర్ గా నియమితులైన వ్యక్తిని.. మోడీ సర్కారు కొనసాగించటం చాలా అరుదని చెప్పాలి. అలాంటి ఛాన్స్‌ను సొంతం చేసుకున్న అతికొద్ది మందిలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు నరసింహన్. గతంలో సీబీఐ చీఫ్ గా వ్యవహరించిన ఆయనకు గవర్నర్ గిరిని సోనియాగాంధీ కట్టబెట్టగా.. మోడీ ప్రధాని అయ్యాక కూడా కంటిన్యూ కావటం నరసింహన్ టాలెంట్ గా చెప్పాలి.
గవర్నర్ గా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం.. కాంగ్రెస్ పార్టీ హయాంలో గవర్నర్ గిరి దక్కినప్పటికీ.. ఆ వాసనలేమీ తనకు లేనట్లుగా మోడీ పరివారాన్ని నమ్మించటంలో నూటికి నూరు మార్కులు సంపాదించిన నరసింహన్.. మూడో దఫా గవర్నర్ గా ఛాన్స్ కోసం తెగ ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.సీబీఐ చీఫ్ గా వ్యవహరించిన ఆయన.. తన కంటే జూనియర్.. ప్రస్తుతం కేంద్రంలోని మోడీకి అత్యంత విశ్వసనీయుడైన అజిత్ దోవల్ చేత లాబీయింగ్ చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. నరసింహన్ పదవీకాలాన్ని పొడిగించాలని మోడీనే ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. ఆయనే కాదు.. కేంద్రంలోని పలువురు సీనియర్ ఐపీఏస్ అధికారులు సైతం మోడీ సర్కారు మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు.
గవర్నర్ ను మూడోసారి చాన్స్ ఇవ్వటం సాధ్యం కాదన్న విషయాన్ని రాజ్ నాథ్ తేల్చినట్లుగా చెబుతున్నారు. నరసింహన్ స్థానంలో ఎవరిని గవర్నర్ గా కావాలో సూచన చేయొచ్చన్న మాటను ఇరువురు చంద్రుళ్లకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాత్కాలికంగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించినప్పటికీ.. అది రాష్ట్రపతి ఎన్నిక ముగిసే వరకూ ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. నరసింహన్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు.