Posted [relativedate]
అన్నాడీఎంకే గమనం ఎటు వైపో ఎవరికీ అర్థం కావడం లేదు. పళనిస్వామి సీఎంగా సీన్ లోకి వచ్చినా… రాజకీయ అనిశ్చితి తొలగిపోవడం లేదు. అసలు ఎవరివైపు ఉండాలో.. పార్టీ నాయకులు, క్యాడర్ కు అర్థం కావడం లేదు. వారికి అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడే లేడు. దీంతో బాబాయ్… అదేనండి చిన్నమ్మ భర్త నటరాజన్… పార్టీని బతికించుకునేందుకు ఆఖరి అస్త్రం ప్రయోగించేందుకు పావులు కదుపుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
పన్నీర్ సెల్వం మాజీ సీఎంగా మిగిలిపోయినా… జనంలో మాత్రం ఆయనపై చాలా సానుభూతి ఉంది. పార్టీ ఎమ్మెల్యేలకు ఈ విషయం ఎప్పుడో అర్థమైంది. దీంతో ఎమ్మెల్యేలు నటరాజన్ కు విషయాన్ని వివరించారట. ఈ దినకరన్ తో ఏం జరగదు….!!! సీఎం పళనిస్వామికి అంత సీన్ లేదు…!!! ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కంటే.. ముందు పార్టీని కాపాడుకోవడం మీద దృష్టి పెట్టాలని సూచించారట. తమ మాటగా చిన్నమ్మకు వాస్తవాలు చెప్పాలని విన్నవించుకున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నీర్ సెల్వంను తిరిగి తీసుకొస్తే తప్ప అన్నాడీఎంకే కుదురుకోవడం కష్టమని చెప్పుకొచ్చారని టాక్. వీరి వాదనతో చిన్నమ్మ భర్త నటరాజన్ కూడా ఏకీభరించారని తెలుస్తోంది.
శశికళ భర్త నటరాజన్ ముందు నుంచి సెల్వంకే మద్దతు పలికినట్టు టాక్. అయితే మన్నార్గుడి మాఫియా వల్లే … సెల్వంను తీసేసి… సీఎం పదవి కోసం చిన్నమ్మ ఆశ పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాగూ సీఎం పదవి సాధ్యం కాలేదు. కనీసం ఇప్పటికైనా పార్టీని బతికించుకోవడం కోసం సెల్వంను తిరిగి సీఎంను చేయాలని …శశికళకు నటరాజన్ సూచించారట. అందుకు ఆమె మౌనం వహించారట. మౌనం అర్థాంగీకారమే కావచ్చు…కానీ ఇంత పెద్ద నిర్ణయం వెనుక ఆమె ఆమోదం తప్పని సరి కాబట్టి… ప్రస్తుతానికి నటరాజన్ .. శశికళకు కొంత సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది.
భర్త నటరాజన్ చెప్పిన మాటలపై శశికళ కూడా బాగా ఆలోచిస్తున్నారట. పళనిస్వామి సీఎం అయితే తాత్కాలికంగానే లాభం. అదే సెల్వం అయితే… తన భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు. పైగా సెల్వం చెప్పినట్టు వింటారు. కాబట్టి ఇదేదో బాగానే ఉందని చిన్నమ్మ అనుకుంటోందని టాక్. మరి అదే జరిగితే చిన్నమ్మ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నలు తలెత్తడం ఖాయం.!!! అయితే సెల్వం మళ్లీ సీఎం కావడం అంత ఈజీ కాదంటున్నారు అన్నాడీఎంకే వర్గాలు… ఎందుకంటే జైలుకెళ్లిన తర్వాత శశికళ యూటర్న్ తీసుకోవడం దాదాపు అసంభవమే!!!