చేతికి ప‌నిచెప్పిన‌ హోంమంత్రి!!!

 Posted March 25, 2017

nayani narsimha reddy slap to trs leader mahender kumar
హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి టీఆర్ఎస్ లో సీనియ‌ర్ నాయ‌కులు. సీఎం కేసీఆర్ కూడా ఆయ‌న‌కు అమిత‌మైన గౌర‌వం ఇస్తారు. అందుకే ఆయ‌న‌ను ఏరికోరి మ‌రీ హోంమంత్రిగా చేశారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ప‌నిఒత్తిడో.. మ‌రే కార‌ణ‌మో.. తెలియ‌దు కానీ నాయినికి ఉన్న ప‌ళంగా కోపం వ‌స్తోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాలు… అధికార‌ప‌క్షంలో విమ‌ర్శ‌లు చేయ‌డం సాధార‌ణ‌మే. అధికార ప‌క్షం నుంచి కేటీఆర్, హ‌రీశ్ రావు, ఈటెల రాజేంద‌ర్ లాంటి మంత్రులు… విప‌క్షాల‌ను కౌంట‌ర్ చేయ‌డంలో ముందుంటారు. కానీ ఇటీవ‌ల అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాలు ఏం మాట్లాడినా నాయినికి కోపం వ‌చ్చేస్తోంద‌ట‌. శృతిమించి మ‌రీ ఆయ‌న కౌంట‌ర్ ఇస్తున్నార‌ని అసెంబ్లీ లాబీల్లో ఇత‌ర పార్టీల నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ఇక ఇటీవ‌ల టీఆర్ఎస్ స‌భ్య‌త్వ న‌మోదులోనూ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి త‌న‌లోని కోపాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నారు. స‌భ్య‌త్వ న‌మోదు సంద‌ర్భంగా పార్టీలో మొదటి నుంచి ఉన్న ఆర్వీ మ‌హేంద‌ర్ కుమార్ కు నాయిని మైక్ ఇవ్వ‌లేదు. పైగా పార్టీలో ఆయ‌న త‌ర్వాత చేరిన నంద‌కుమార్ వ్యాస్ ను ప్ర‌సంగించాల్సిందిగా కోరారు. దీంతో మ‌హేంద‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అంతే… నాయినికి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. మ‌హేంద‌ర్ కుమార్ పై నోటికి ప‌ని చెప్పారు. ప‌రిస్థితి చేయి చేసుకునే దాకా వెళ్లింది. ఈ దెబ్బ‌తో అక్క‌డ ఉన్న పార్టీ నాయ‌కులంతా షాక‌య్యారు. అసంతృప్త నాయ‌కుల‌కు స‌ర్దిచెప్పాల్సిన పెద్దాయ‌న‌… ఈర‌కంగా చేయిచేసుకోవ‌డం ద్వారా పార్టీ శ్రేణుల‌కు రాంగ్ సిగ్న‌ల్స్ పంపిన‌ట్ట‌య్యింది.

నాయిని ఇప్పుడు టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత మాత్ర‌మే కాదు.. హోంమంత్రి కూడా. అంత పెద్ద హోదాలో ఉన్న వ్య‌క్తి ఇలా పార్టీ నాయ‌కుడిపై చేయిచేసుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు కేసీఆర్ దాకా వెళ్లింద‌ట‌. ఏదేమైనా నాయిని ఇలా ప్ర‌తిదానికి కోపం తెచ్చుకోవ‌డం స‌రికాద‌న్న వాద‌న టీఆర్ఎస్ శ్రేణుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

SHARE