ఖాకీ పాలు తాగిన నయీమ్

 nayeem drunk police milk
కనిపించినట్టే కనిపించి మాయమయ్యేవాడు. జాడ పసిగట్టే సరికి మరోచోట నేరం చేసేవాడు. అండర్ గ్రౌండ్ నేరాలకు పెట్టింది పేరు. లాండ్ సెటిల్ మెంట్లకు కేరాఫ్ అడ్రస్. పేరుచెబితే చాలు హడలిపోయే నయీం ఓ మామూలు నేరగాడు కాదు. ఈ సమాజం పెంచి పోషించిన ఓ నయా దావూద్. నక్సలైట్ గా పుట్టి నేరగాడుగా అంతమైన నయీం చరిత్రలో ఎన్నెన్నో చీకటి మలుపులు.

నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం సమసమాజ స్థాపన కోసమంటూ 30 ఏళ్ల క్రితం నాటి పీపుల్స్ వార్‌లో చేరాడు. అగ్రనేతలు పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేశాడు. వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించిన నయీం… ఆ తరవాత అదే నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయంగా మార్చుకున్నాడు. ఆ పరిణామ క్రమంలోనే పోలీసులకు దగ్గరయ్యాడు. నయీంను పోలీసులు చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేశాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్‌కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతల్ని మట్టుపెట్టారనేది ప్రచారంలో ఉంది. ఇక నయీమొద్దీన్ చేసిన దారుణ హత్యలు అనేకం. నక్సలైట్ గా ఉన్న సమయంలో ఐపీఎస్ అధికారి వ్యాస్ ను పొట్టనపెట్టుకున్నాడు. ఆ కేసులో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ప్రత్యక్ష సాక్షి. చివరకు ఆ కేసు సరైన ఆధారాలు లేని కారణంగా 14 సంవత్సరాల తర్వాత న్యాయస్థానం కొట్టేసింది.

ఇక అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే భువనగిరి పట్టణంలో నక్సల్ సానుభూతి పరురాలు, ప్రజాగాయకురాలు బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు అవిభక్త ఏపీలో మారుమోగిపోయింది. అనంతర కాలంలో పౌర హక్కుల నాయకులు పురుషోత్తం, కరుణాకర్‌ నయీం చేతిలో ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రజాహక్కుల నేత ఆజం అలీ హత్య కేసులోనూ నయీం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్‌మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్‌బీ నగర్‌కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ హత్య, మావోయిస్టు మాజీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్‌ఎస్ నాయకుడు కె.సాంబశివుడు, ఆయన తమ్ముడు రాములు హత్య కేసులు కూడా నయీం గ్యాంగ్ పనే. ఇక రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ పేరిట నేరాలకు పాల్పడ్డ పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి కూడా నయీం గ్యాంగ్ చేతిలోనే చనిపోయాడు. ఇలా లెక్కలేనన్ని హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ చిరునామా అయ్యాయి. పలు న్యాయస్థానాల్లో నయీంపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

మ ఉమ్మడి శత్రువులైన మావోలు, నక్సల్ సానుభూతి పరులను హతమారుస్తుండడంతో నయీంపై పోలీసులకు సహజంగానే సానుభూతి ఏర్పడింది. దాన్నే అదునుగా తీసుకున్నాడు నయీం. తిరుగులేని నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు సైతం విస్తరించాడు. రకకకాల గ్యాంగ్ లు ఏర్పాటు చేశాడు. అండర్ వరల్డ్ డాన్ లా రూపాంతరం చెందాడు. అవకాశాలు కొద్దరిని ఉన్నతులను చేస్తాయి. మరికొందరిని వక్రమార్గంలోకి నెడుతాయి. నయీం విషయంలో రెండోదే జరిగింది. బెదిరింపులకు దిగినందుకు డబ్బు, లాండ్ సెటిల్ చేసినందుకు డబ్బు. ఇలా ఇబ్బడిముబ్బడిగా వస్తున్న డబ్బుతో నయీంలో కొత్త ఆలోచనలు రేకెత్తాయి. సొంతంగానే గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సైబరాబాద్, హైదరాబాద్‌లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అవిభక్త ఏపీని దాటి జాతీయ స్థాయికి ఎదిగాడు. నల్లమల కోబ్రాస్‌, కాకతీయ కోబ్రాస్‌, నర్సా కోబ్రాస్…ఇలా పలు పేర్లతో గ్యాంగ్ లు వెలిశాయి.

హిందీ రాష్ట్రాల కోసం క్రాంతిసేన పేరిట మరో గ్యాంగ్ ఏర్పడింది. గుజరాత్‌ పోలీసులకు నయీం మోస్ట్‌వాంటెడ్‌ నేరగాడు. ఆయుధాల స్మగ్లింగ్‌ నిందితుల లిస్టులో ఉన్నాడు. 2008 ఏప్రిల్‌లో చోటారాజన్‌ అనుచరుడు అజీజ్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌ వెనుక కూడా నయీం గ్యాంగ్‌తో విభేదాలే కారణమని భావిస్తారు. క్రాంతిసేన పేరిట చెలరేగిన నయీం రాష్ట్రంలోనే కాక చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, వెస్ట్‌బెంగాల్‌లోనూ తననెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు. అంతేకాదు.. బంగ్లాదేశ్‌ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లి ఐఎస్ఐతో చేతులు కలిపినట్లు పోలీసువర్గాలు గుర్తించాయి.ఇక నేరాలు చేస్ స్టైల్ లో విషయంలో నయీంది కొత్త పంథా. ఎక్కడా బయటకు రాకుండా నయీం ముఠా నేరాలు సాగించేది. నేరం తర్వాత సదరు నిందితులు అరెస్టయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటాయి. నేరాలకు పాల్పడేది ఒకరైతే, 48 గంటల్లోనే లొంగిపోయే వారు మరొకరు. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోయారు.చట్టం చేతులు చాలా పెద్దవనేది నానుడి. అది నిజమే అని నయీం ఎన్ కౌంటర్ నిరూపిస్తోంది. చట్టం కన్ను తెరిస్తే ఎంతటి వారయినా తప్పించుకోలేరనేందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

అందుకే ఎంతో మందిని వందలాది మందిని బెదిరించి నరకం కళ్లచూపిన హంతకుని కథ కూడా అలాగే ముగిసింది. గ్రేహౌండ్స్ ను సృష్టించిన పోలీసు అధికారిని చంపిన నయీం చివరకు అదే గ్రేహౌండ్స్ చేతిలో హతమవడం కాకతాళీయం.చివరకు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. ఏపీ విడిపోవడం, తెలంగాణ ఏర్పడడం..నయీం కార్యకలాపాలన్నీ ఎక్కువగా తెలంగాణాలోనే కావడంతో కథలో మార్పు వచ్చింది. కొత్త ప్రభుత్వంతో నయీం ఆటలు సాగకుండా పోయాయి. అందుకే ఎప్పుడో తప్ప బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని నెలలుగా నయీం కదలికలపై కన్నేసిన పోలీసులు చివరకు ఆసుపాసులన్నీ కనిపెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు కనిపెట్టారు. అందుకే మాటేశారు. మట్టుపెట్టారు.

సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఆపరేషన్ నయీం మొదలైంది. నయీం ఫోన్ నంబర్ తెలుసుకున్న పోలీసులు జీపీఎస్ ఆధారంగా షాద్ నగర్ లో సిగ్నల్స్ ఉన్నట్లు గ్రహించారు. మిలీనియం టౌన్ షిప్ కు రాబోతున్నట్లు కనిపెట్టారు. చుట్టుపక్కల ఇళ్ల వారిని ముందే నిర్బంధంలోకి తీసుకున్నారు. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.40 గంటల ప్రాంతంలో నయీం ఏపీ 28 డీఆర్‌ 5859 నంబర్‌ ఫోర్డ్‌ ఇండీవర్‌ కారులో కాలనీలోకి ప్రవేశించాడు. సదరు నివాసానికి కాస్త దూరంలో ఉండగానే పోలీసులు పొజిషన్ తీసుకున్నారు. నయీం కారును చుట్టుముట్టాయి. దాంతో, కారులో నుంచే నయీం ఏకే 47తో పోలీసులపై కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే నయీం, అతడి డ్రైవర్‌ పోలీసులపై కాల్పులు జరుపుతూ కారు దిగి పారిపోయే ప్రయత్నం చేశారపి. దాంతో తాము జరిపిన ఎదురు కాల్పుల్లో నయీం అక్కడికక్కడే మరణించాడని పోలీసుల కథనం.

SHARE