Posted [relativedate]
తారాగణం: రామ్ శంకర్, రేష్మీమీనన్, ఆదిత్యమీనన్, శరత్‌కుమార్
సంగీతం: మహిత్ నారాయణ్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ రామస్వామి
నిర్మాత: శ్రీకాంత్ రెడ్డి
సంస్థః వైబా క్రియేషన్స్
దర్శకత్వం: సుదర్శన్ సాలేంద్ర
టాలీవుడ్ లో అప్పటివరకు అపజయాలను అందుకుంటున్న తారలు చాలామంది తమ పేర్లను మార్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో హిట్స్ కొట్టారు. ఇది తెలుగు ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ అని కూడా చెబుతుంటారు. అలా పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ తన పేరు రామ్ శంకర్ గా మార్చుకుని నటించిన సినిమా నేనోరకం. కోలీవుడ్ హీరో శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ లెవల్లో ప్రమోషన్స్ కూడా జరిగిన ఈ సినిమా ప్రీమియర్ షోను ఈ రోజు నిర్వహించారు. మరి రామ్ శంకర్ మారిన పూరీ తమ్ముడు ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాడో లేదో తెలుగు బుల్లెట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కధేంటంటే:
ఈ సినిమాలో రామ్ శంకర్.. గౌతమ్ గా, రేష్మి మీనన్.. స్వేచ్ఛగా నటించారు.
గౌతమ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పని చేస్తుంటాడు. ఆ సమయంలో అతను స్వేచ్ఛను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ఇంప్రెస్ చేస్తాడు. స్వేచ్ఛ తన ప్రేమను చెప్పేలోగా ఆమెను శరత్ కుమార్ కిడ్నాప్ చేస్తాడు. తాను చెప్పిన పనులు చేయాలని, లేకుంటే స్వేచ్చను చంపేస్తానని శరత్ కుమార్.. గౌతమ్ ని బెదిరిస్తాడు. చేసేది లేక గౌతమ్.. కిడ్నాపర్ చెప్పినదంతా చేస్తూ ఉంటాడు. చివరకు ఓ వ్యక్తిని చంపమంటాడు కిడ్నాపర్. అసలు శరత్ కుమార్ ఎవరు.. అతను గౌతమ్ జీవితంలోకి ఎందుకొచ్చాడు… గౌతమ్ చంపాలనుకున్న వ్యక్తి ఎవరు అనే ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
కధనం ఏంటంటే:
ప్రేమ పేరుతో మోసపోతున్న అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు పడే బాధను మిక్స్ చేస్తూ ఓ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన మూవీనే నేనోరకం. ఫస్టాఫ్ నుండి ప్రీ ఇంటర్వెల్ వరకు హీరో హీరోయిన్ మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సీన్లు, కామెడీ తప్ప మిగతా కథనం అంతా సాగదీసినట్టుగా ఉంటుంది. అయితే ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో సెకండాఫ్ ఆసక్తికరంగా మారుతుంది.
ఎవరు ఎలా చేశారంటే:
ఫస్టాఫ్ అంతా ప్రేమ కోసం అమ్మాయి వెంటపడే ప్రేమికుడుగా మెప్పించిన రామ్ శంకర్.. సెకండాఫ్‌లో తన లవర్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే యువకుడుగా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. రేష్మి మీనన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇక శరత్ కుమార్ డిఫరెంట్ క్యారెక్టర్ లో, తన నేచురల్ యాక్టింగ్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. దర్శకుడు సుదర్శన్ సాలేంద్ర ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ పాయింట్ ను డిఫరెంట్ యాంగిల్ లో తెరకెక్కించాడు. సెకండాఫ్ లో నడిచే రేసీ సన్నివేశాల్లో కెమెరా వర్క్ రియలిస్టిక్ గా ఉంది. మహిత్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హెల్ప్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్:
రామ్ శంకర్, శరత్ కుమార్ ల నటన
ఇంటర్వెల్ బాంగ్
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్
సందర్భం లేకుండా వచ్చే పాటలు
సీ. జీ. వర్క్
ఆఖరిపంచ్: నేనోరకం.. అదో రకం
Telugu Bullet Rating: 2.5/5