Posted [relativedate]
దేశంలో పెద్ద నోట్ల రద్దు వల్ల మనకే ఇబ్బందనుకుంటున్నారా.. నేపాల్ ఉన్న ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయంటా.. మన దేశ నోట్లు రద్దు చేస్తే వాళ్లకొచ్చిన నష్టమేంటంటా అని ఆలోచిస్తున్నారా.. ఆ దేశం మన పక్కనే ఉండటం.. అక్కడ నుంచి మన దగ్గరకు రావడానికి వీసా కూడా అవసరం లేని పరిస్థితులు ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వాళ్ల అవసరాల కోసం రెండు దేశాల కరెన్సీని వాళ్లు తమ దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ రద్దుతో మనంటే బ్యాంకుల్లో మార్చుకుంటాం.. మరి వాళ్ల పరిస్థితి ఏంటనేదాపైనే ఆందోళన చెందుతున్నారు… చివరకు నేపాల్ ప్రధాని ప్రచండ.. భారత ప్రధాని ఫోన్ చేసి మరీ ఈ విషయాన్ని తెలియజేశారు. ముందుగా నోట్ల రద్దు నిర్ణయంపై అభినందనలు తెలుపుతూ.. తమ ప్రజల వద్ద ఉన్న పెద్దనోట్లను మార్పిడి చేసేందుకు నేపాల్లోనూ ఏర్పాట్లు చేయాలని మన ప్రధానిని కోరారంటా.. అక్కడి వారు ఎక్కువ మంది భారత్‌పై ఆధారపడి బతుకుతుంటారు. వేల మంది మన దేశంలో పని చేస్తూ.. ఇక్కడి డబ్బులను అక్కడకు పంపుతుంటారు. అక్కడ వారు వాటిని దాచుకుంటారు. మరికొందరు భారత్‌లో యాత్రలు.. వైద్య ఖర్చుల కోసమంటూ భారత్ కరెన్సీని ఉంచుకుంటారు. సరిహద్దుల్లో ఉన్నవారు భారత్‌లో వస్తువులను కొనుగోలు చేసేందుకు భారత్ కరెన్సీని వినియోగిస్తారు. ఇలా.. నేపాల్ వ్యాప్తంగా రూ.నాలుగు కోట్ల వరకు భారత్ పెద్దనోట్లు ఉంటాయని నేపాల్ రాష్ట్ర బ్యాంకు తెలిపింది. వాస్తవానికి ఇంకా ఎక్కువగా అక్కడ ఇండియన్ కరెన్సీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేపాల్‌లోని భారత్ బ్యాంకుల్లో ఖాతాలున్న వారికి ఏమీ ఇబ్బంది లేదని.. వారు తమ వద్ద ఉన్న పెద్దనోట్లను అక్కడ మార్పిడిచేసుకోవచ్చని ప్రభుత్వం అంటోంది. కానీ ఇక్కడ ఎక్కువ మంది వద్ద పెద్దనోట్లున్నా భారత్ బ్యాంకుల్లో ఖాతాలు లేవు. దీంతో సమస్య వచ్చింది. దీనిపై నేపాల్ ఆర్థిక శాఖ, నేపాల్ రాష్ట్ర బ్యాంకు భారత్‌కు ఇదివరకే లేఖలు రాశాయి.