Posted [relativedate]
తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ఏటైంలో మొదలైందో తెలియదు కానీ…. ఎవరూ ఊహించనివిధంగా అనూహ్య మద్దతు లభించింది. తమిళ తంబీలు జల్లికట్టును చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీంతో ఎవరికి తోచినట్టుగా వారు సపోర్ట్ ఇచ్చారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా జల్లికట్టుగా మద్దతుగా ఏం చేయాలని ఆలోచించారు. పోరాటానికి మద్దతుగా థియేటర్లలో సినిమాలను అయితే ఆపలేరు. ఎందుకంటే కోలీవుడ్ మొత్తం జల్లికట్టు బరిలోకి దిగింది. దీంతో ఈ ఆందోళనకు మద్దతుగా పెప్సీ, కోకకోలా వంటి విదేశీ శీతల పానీయాలను నిషేధించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో పక్కా స్వదేశీ అయిన గోలీ సోడా, కలర్ సోడా, నిమ్మకాయ సోడాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
థియేటర్ల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంతో గోలీ సోడాల బిజినెస్ కు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. చెన్నైతో పాటు తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ సోడాల విక్రయాలు ఊపందుకున్నాయి. థియేటర్లలో సోడాలు.. అనుకున్నదానికంటే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయట. ఎందుకంటే కూల్ డ్రింక్స్ తో పోలిస్తే… గోలీ సోడాల రేటు చాలా తక్కువ. పైగా థియేటర్ కు వచ్చిన వారంతా సోడాలు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారట. దీంతో ఈ బిజినెస్ బాగుందని థియేటర్ల వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని టాక్.
థియేటర్లలోనే కాదు బయట కూడా ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందట. జల్లికట్టు పుణ్యమాని రెండు చేతులతోనూ సంపాదిస్తున్నామని గోలీసోడా వ్యాపారులు ఖుషీగా ఉన్నారట. థియేటర్లలాగే బయట షాపుల్లోనూ కూల్ డ్రింక్స్ ను నిషేధిస్తే… బాగుంటుందని కోరుకుంటున్నారట. అయితే విదేశీ కంపెనీల గుత్తాధిపత్యం పెరిగిన ప్రస్తుత తరుణంలో అది అంత ఈజీ కాదేమో!!