ఎన్టీఆర్ నిజరూపం ఇదే..

 ntr-real-attitude
ఎక్కడికెళ్లినా మొహం మీద ఫోకస్ లైట్స్ ..వెండితెర మీద కనిపిస్తే చప్పట్లు ,విజిల్స్ …బయట కనిపిస్తే జయజయధ్వానాలు ..సినిమా రిలీజ్ అనగానే భారీ కటౌట్లు ,పాలాభిషేకాలు …బద్దలవుతున్న సినీ రికార్డులు..భయపడుతున్న దిగ్గజాలు …ఇంటిచుట్టూ దర్శకనిర్మాతల పడిగాపులు …విజయాలతో ప్రపంచానికి తాను మాత్రం పరిచయమై ..ప్రపంచమంటే తనకి పరిచయం లేని నూనూగు మీసాల ప్రాయంలో..పై అనుభవాలన్నీ ఎదురైతే …స్వీయప్రకటిత చక్రవర్తిగా చిత్ర రంగాన్ని ఏలుదామని ఎవరైనా అనుకుంటారు ..ఇంతలోనే నాణేనికి బొమ్మే కాదు బొరుసు కూడా ఉందని తెలిసొస్తే ..కాలం గెలుపు పల్లకిని గిరవాటేస్తే …వరుసగా ఆశాసౌధాలు కూలిపోతుంటే …తన మీదే నమ్మకం పెట్టుకున్నవాళ్ళు కుమిలిపోతుంటే ..ఓటమిని జీర్ణించుకోవడం గెలుపు ని అనుభవించినత తేలిక కాదని అర్ధం అవుతుంటే…వెండితెర వెలుగుజిలుగులు వెనుక వున్న కఠిన వాస్తవాలు కళ్ళ ముందే నిలబడితే …ఆ పరిస్థితుల్ని తట్టుకోడానికి ఎంత గుండె ధైర్యం కావాలి? ఆ జీవన సమరాన్ని కొనసాగిస్తూనే తానేమిటో తెలుసుకొని …పూర్వవైభవాన్ని పొందాలంటే ఎంత సంయమనం కావాలి?మరెంత పరిణితి కావాలి?కళ్ళ ముందు లక్ష్యాన్ని మాత్రమే నిలుపుకోడానికి ఎంత ఏకాగ్రత కావాలి?

ఆ శక్తులన్నీ ఎన్టీఆర్ సొంతమిప్పుడు…జనతా గ్యారేజ్ ఆడియో వేడుకలో ఆ శక్తుల్ని తనలో ఇముడ్చుకున్న సరికొత్త ఎన్టీఆర్ ఆవిష్కృతమయ్యారు.తనకెరీర్లో 12 ఏళ్ల కాలాన్ని విశ్లేషించి 10 ముక్కల్లో తానేమిటో సూటిగా అభిమాని గుండెతలుపు తట్టి మరీ చెప్పగలిగారు.అభిమానుల ఆశలు
తీర్చడానికి తనెంత మధనపడిందీ వివరించారు.అయినా విజయాలు దక్కలేదని తన మీద తానే జోకులు విసురుకుని హాయిగా నవ్వుకునే స్థాయికి వెళ్లారు.అయినా ఎక్కడో మిణుకుమిణుకు ఆశ ఉందని తనలో పోరాటపటిమని చాటిచెప్పారు.అన్నిటికన్నా ముఖ్యంగా తనను దేవుడిగా ఆరాధించే అభిమానుల ముందు తాను మామూలు మనిషినని చెప్పుకుని మనీషిగా ఎదిగారు.దేవుడే అపజయాల మొట్టికాయలు వేసి తనకు సరైన దారిలో వెళ్లడం నేర్పాడని చెప్పారు.

నన్ను నేను తక్కువ చేసుకుంటున్నానని అనుకోవద్దంటూనే అభిమానులతో ఓ కుటుంబసభ్యుడిలా కష్టసుఖాలు చెప్పుకున్నారు.మోహన్ లాల్,కొరటాలశివ ,తిరు,దేవి గురించి చెప్పేటప్పుడు వారి ప్రతిభతో పాటు,వ్యక్తులుగా వారినుంచి ఎంత నేర్చుకున్నారో చెప్పడానికే ప్రాధాన్యమిచ్చారు.పాలాభిషేకాలు,జంతుబలులు,ఇంటికి క్షేమంగా వెళ్లడం గురించి అభిమానుల్ని మరీమరీహెచ్చరించారు.నేను దేవుడిని కాదు …నన్నుదేవుడిని చేయొద్దు ..నేనో నటుడిని మాత్రమే అని ఎన్టీఆర్ నిజాయితీగా ,నిండుమనసుతో చెప్పిన మాటలు …నిజంగా నటుడిగానే కాదు ఓ మనిషిగా అయన విలువని పెంచాయి.ఆయన్ని సూపర్ స్టార్ రజని తో పోలుస్తూ సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తలైవా అని పిలుస్తారట..

జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ మాటలు విన్నాక,అయన గుండె ఘోష కన్నాక ఆ పిలుపుకి ఎన్టీఆర్ నిజమైన అర్హత పొందారనిపిస్తుంది.నటనతో పేరులోవున్న జూనియర్ ని చెరిపిన ఎన్టీఆర్ తాజా ప్రసంగం మనిషిగా ఆయన ఎక్కిన,ఎక్కబోతున్న ఎత్తులకు ఓ మైలురాయి..మొత్తానికి ఎన్టీఆర్ నిజరూపదర్శనం చేయించిన జనతా గ్యారేజ్ భారీ విజయం అందుకోవాలని మనసారా కోరుకుంటోంది తెలుగుబుల్లెట్.కామ్ ..ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్

*కిరణ్ కుమార్ 

SHARE