Posted [relativedate]
ఎలాగైనా శశికళ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చేందుకు పన్నీర్ సెల్వం కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అందరూ తనకు మద్దతు పలుకుతున్నా.. ఎమ్మెల్యేలు తనవైపు ఉంటేనే పన్నీర్ ఏదైనా చేయగలరు. అందుకే శశిని ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా చిన్నమ్మ క్యాంపును విచ్ఛిన్నం చేసేందుకు ఫిర్యాదుల అస్త్రం ప్రయోగిస్తున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో … సెల్వం వర్గం ఈ కంప్లయింట్స్ అస్త్రాన్ని అమలు చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ… అక్కడి జనంతో పోలీసులకు ఫిర్యాదులు చేయించి శశికళపై ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగానే వేలూరు జిల్లా ఆరణి శాసనసభ్యుడు, దేవాదాయ శాఖ మంత్రి సేపూరు రామచంద్రన్ ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లాలోని అంటూరు ఎమ్మెల్యే బాలసుబ్రమణి కిడ్నాప్‌కు గురయ్యారని అక్కడి జనం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక కొన్ని చోట్ల ఎమ్మెల్యేల కుటుంబసభ్యులే పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఎమ్మెల్యేలను వెదికి పట్టుకోవాలని కోరారు. ఈ దెబ్బతో శశికళ ఉక్కిరిబిక్కిరవుతోంది.
పోలీసు ఫిర్యాదుల అస్త్రాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక శశికళ తికమకపడుతోందట. అందుకే ఎమ్మెల్యేలను ఒకే క్యాంపులో పెట్టకుండా బృందాలుగా పక్కరాష్ట్రాలకు తరలించే ప్రయత్నం చేస్తోందని సమాచారం. అలా చేస్తే శశికళకే ముప్పు ఉంటుందని టాక్. ఎందుకంటే బృందాలుగా ఎమ్మెల్యేలను విడగొడితే.. రిస్క్ ఎక్కువ. అటు సెల్వం వర్గం నీడలా ఎమ్మెల్యేలను ఫాలో అవుతున్న తరుణంలో అది అంత సేఫ్ కాదు. అయినప్పటికీ ఇదే ప్లాన్ ను అమలు చేసేందుకు శశికళ ఆలోచిస్తోందని తెలుస్తోంది.
రోజుల తరబడి ఎమ్మెల్యేలను క్యాంపులో ఉంచటం శశికళకు శక్తికి మించిన పనే. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగే అవకాశం ఎక్కువ. ఈ కన్ఫ్యూజన్ లో వారు చిన్నమ్మకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ క్యాంప్ పాలిటిక్స్ తో శశికళ తాను అనుకున్నది సాధిస్తుందో.. లేదో మరో వారం రోజుల్లో తేలిపోనుంది.