తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీతో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన ఎంఐఎం పార్టీ క్రమక్రమంగా తన ప్రాబల్యాన్ని ఇతర రాష్ర్టాలకు కూడా విస్తరించుకుంటోంది. మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ఔరంగాబాద్ నుంచి విజయం సాధించింది. దీంతో ఎంఐఎం మహారాష్ర్ట అసెంబ్లీలో అడుగుపెట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేసినా విజయం సాధించలేకపోయింది.
ఈ నేపథ్యంలోనే ఎంఐఎం ఇప్పుడు పొరుగునే ఉన్న తెలుగు రాష్ర్టమైన ఏపీపై దృష్టిసారించింది. ఏపీ రాజధాని విజయవాడలో పాగా వేసేందుకు ఎంఐఎం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ర్ట విభజన తర్వాత ఏపీలో కూడా ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసి దాన్ని ఎంఐఎం ఓటుబ్యాంకుగా మలచాలని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఆయన ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ముస్లింలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
విజయవాడతో పాటు మైనార్టీలు అధికంగా ఉన్న కర్నూలు, గుంటూరు, అనంతపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ముస్లింలు కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విజయవాడలో బుధవారం ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి పర్యటించారు. ప్రార్థనా మందిరాల తొలగింపు అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులు, ముస్లింల ప్రార్థనా మందిరాల తొలగింపుపై కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఇక విజయవాడలో జరిగిన పరిస్థితులను పార్టీ అధినేత అసదుద్దీన్‌కు వివరిస్తామని, అవసరమైతే పోరాటాలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఏదేమైనా ఏపీ ముస్లిం నేతలతో అసద్ చర్చలతో పాటు పాషాఖాద్రి పర్యటన చూస్తుంటే ఏపీపై కూడా ఎంఐఎం కన్నేసినట్టు తెలుస్తోంది.