ప్రకాశం జిల్లాలో పసందైన క్రికెట్ మ్యాచ్ సాగుతోంది. టీడీపీ పాత కాపులు ఓ జట్టు.. కొత్తగా వచ్చినోళ్ళు మరో జట్టు… మ్యాచ్ మైదానం.. సి ఐ ల బదిలీ వ్యవహారం.. ఇంకేముంది….ఖద్దరు బ్యాట్ లు.. ఖాకీ బంతులతో బదిలీల ఆటాడేసుకుంటున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో తేలాలంటే అంపైర్ గా వ్యవహరించే సీఎం చంద్రబాబు నిర్ణయం కోసం ఆగాల్సిందే.
ఇటీవల సీఎం చంద్రబాబు ఒంగోలు టూర్ సందర్భంగా మొదలైన ఈ పోటీ ఇప్పుడు తారస్థాయిని చేరింది. ముఖ్యంగా అద్దంకి వేదికగా పాత కాపు కరణం బలరాం, కొత్త కాపు గొట్టిపాటి రవికుమార్ లు అద్దంకి సిఐ బదిలీ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పావులు కదుపుతున్నారు.. ఎత్తు ఎత్తుకి ఉత్కంఠ…
అసలు మ్యాటర్ లోకి వెళ్తే … అద్దంకి సిఐ బి.ప్రసాద్, కందుకూరు సిఐ సుధాకరరావును గతం లో ఒకసారి బదిలీ చేశారు… ప్రసాద్ స్థానంలో హైమారావు, సుధాకరరావు స్థానంలో సుబ్బారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అధికార పార్టీ నేతలు అడ్డుపడడంతో ఆ ఆర్డర్ అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయింది. గొట్టిపాటి రవికుమార్ అండ్ కో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాక. ఆయన మాటలకు విలువిస్తూ అప్పట్లో ఆగిపోయిన నిర్ణయాలే మళ్ళీ చేశారు.. విషయం తెలిసిన వెంటనే కరణం రంగంలోకి దిగారు. నేరుగా పోలీస్ బాసులతో మాట్లాడి ప్రస్తుతానికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్లను ఆపగలిగారు. ఈ నేతల మధ్య పోరుతో ఖాకీల పరిస్థితి ఆడ కత్తెరలో ఫోన్ చెక్కులా తయారయింది.
ఇంత జరిగాక ఏ నిర్ణయం తీసుకుంటే.. ఏమౌతుందో.. ఎవరు ఎలా ప్రతిస్పందిస్తారో తెలియని పరిస్థితి .. అందుకే చైనా టూర్ నుంచి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు విషయం తీసుకెళ్లాలని బావిస్తునట్టు సమాచారం.. ఆయన ఎవరికి టిక్ కొడతారో.. ఎవరికి చెక్ పెడతారో? చంద్రబాబు అంపైరింగ్ నిర్ణయం తర్వతే ఖద్దరు బ్యాట్ లు.. ఖాకీ బంతుల ఆటలో విజేతల్ని అధికారికంగా ప్రకటిస్తారు…