ఒంగోలు వైకుంఠపాళి…

0
786

  ongole politics war

రాజకీయం …. ఓ వైకుంఠపాళి.. ఎవరెప్పుడు నిచ్చెన ఎక్కుతారో .. ఎవర్ని పాము మింగేస్తుందో.. ఎవరికీ తెలియదు.. కాలం కలిసొచ్చినపుడు మన ప్రతాపం అనుకోవడం…. అదేకాలం ఎదురుతిరిగినపుడు పక్క వాడి మీద అభాండం వేయడం సర్వ సాధారణం.. ప్రకాశం జిల్లా టిడిపి రాజకీయాలు ఈ వైకుంఠపాళికి నిలువెత్తు నిదర్శనం..

ఒకప్పుడు ప్రకాశం జిల్లా లో టిడిపి అంటే బలరాం.. బలరాం అంటే టిడిపి అనుకునేవాళ్లు.. నిన్నగాక మొన్న సీఎం చంద్రబాబు టూర్ లో ఏమైందో అందరం చూశాము.. పార్టీలోకొచ్చిన కొత్త నేతలతో చిరునవ్వులు చిందించిన సీఎం..పాత మిత్రుడ్ని పట్టించుకోనట్టే ఉండిపోయారు.ఇది చూసిన వాళ్ళుకొందరు అయ్యో పాపం అనుకొన్నారు..ఆయన వల్ల పార్టీకి దూరమైనవాళ్లు ..దెబ్బ తిన్నవాళ్ళు ..ఇన్నాళ్టికి సరైన శాస్తి జరిగిందిలే అనుకున్నారు…ఆర్థికంగా బలవంతులైన పెద్ద చేపలు చిన్న చేపని కాదు రాజకీయ వృద్ధ చేపను మింగేశాయి.ఇదంతా బయటకు కనబడిన వ్యవహారం ..మరో వ్యవహారం పెద్దగా బయటకి పొక్కలేదు.దానికి కూడా ఒంగోలు సభ వేదికైంది. రాజకీయంగా ఒకరంటే ఒకరికి పడని రెండు చేపలు కలసి, కొన్ని పిల్ల చేపలను రెచ్చగొట్టి మరో కుర్ర చేపని గుటుక్కుమని పించడానికి చూశాయి…

ఇన్ని విశేషాలకుకారణమైన చంద్రబాబు ఒంగోలు సభ రైతు రుణమాఫీకి సంబంధించి ఏర్పాటుచేశారు.రుణ మాఫీ రెండో విడత పత్రాల్ని అక్కడ రైతులకి అందజేశారు.రుణ మాఫీ అంశంలో ది ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ కీలక పాత్ర పోషించింది .దానికి జిల్లా లో 29 శాఖలున్నాయి.24 మంది డైరెక్టర్ల తో కూడిన పాలక వర్గం ఉంది…ఒకప్పుడు అంతంత మాత్రంగా వున్న బ్యాంక్ ఆర్థిక పరిస్థితి ఈదర మోహన్ చైర్మన్ అయ్యాక గాడిన పడింది… దాదాపు 20 కోట్లకు పైగా నష్టాలలో ఉన్న బ్యాంక్ ఇప్పుడు 3 కోట్ల లాభాలలో ఉంది. అవినీతికి దూరంగా ఉండే ఈయనే మన కుర్ర చేప .రైతు రుణమాఫీ పత్రాల అందజేత కార్యక్రమంలో సహజంగానే కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తారు.ప్రాధాన్యం సరే కనీస గౌరవం అయినా ఇవ్వాలి కదా!

అక్కడే రాజకీయం అసలు రంగు బయటపడింది ఒక వైపు అవమాన భారాన్ని దిగ మింగుకొంటున్న వృద్ధ చేప, వారసత్వ రాజకీయాల్లో భాగంగా MLA అయి జిల్లాలో చక్రం తిప్పుతున్న మరో చేప కూడబలుక్కున్నాయో లేదోగానీ …తమకు తెలిసిన పోలీస్ అధికారులకి రహస్యంగా కన్నుకొట్టి సీఎం సభావేదిక మీదకు ఆ కుర్రచేప రాకుండా అడ్డుకొన్నాయి.ఎందుకంటా?అంటే దేని వెనక మరో పెద్ద కథ ఉంది లెండి….ఆ వృద్ధ చేప శిష్యుడు కో ఆపరేటివ్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు…ఆయన పద్ధతులు నచ్చక పాలకవర్గం ఆ ఉపాధ్యక్షుడ్ని తప్పించాలని చూసింది…ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ పాలక వర్గం కోర్టులోకి వచ్చిపడింది…ఈ వ్యవహారాన్ని ఆపాలని వృద్ధ చేప శతవిధాలా ప్రయత్నించింది.కుర్రచేప అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తనపట్టుతప్పుతుందేమోనని వారసత్వ చేప అడ్డుపుల్ల వేసింది.ఆ వ్యవహారం ఏమైతుందో తెలీదుగాని..ఇంతలో ఒంగోలు సభ జరిగింది.సభ వేదిక మీద కెళ్ళకుండా కుర్ర చేపను ఆపేసి ఆ రెండు చేపలు ప్రస్తుతానికి సంతృప్తి చెందాయి.
కానీ…కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా !ఆడేది వైకుంఠపాళి అయినపుడు …పాము కరిచిన వాడే పందెం గెలవావచ్చు..నిచ్చనెక్కినవాడే బోర్లాపడనూవచ్చు.తస్మాత్ జాగ్రత్త….
*కిరణ్ కుమార్

Leave a Reply