ఉల్లి రైతు కంట నీళ్లు..

  onion farmers cryingఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఈఏడు ఉల్లి సాగు చేసిన రైతులకు ఉల్లి కన్నీరు పెట్టిస్తుంది. బహిరంగ మార్కెట్‌లో కింటాలు ధర రూ. 200 లోపే పలుకుతుండటంతో ఉల్లి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఇదే సమయంలో క్వింటా ధర రూ. 4వేలకు పైగా ఉండింది. అదే ధర వస్తుందనుకొని గతేడాది ఎకరా సాగు చేసిన రైతులు ఈఏడాది 4 ఎకరాల వరకు సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చి మార్కెట్‌కు తీసుకెళ్తే కనీసం కిరాయిలు కూడా రావడం లేదు. దీంతో వడ్డెపల్లి మండలంలోని రైతులు మార్కెట్‌కు తీసుకెళ్లలేక ట్రాక్టర్లతో దన్ని చెడిపేసుకుంటున్నారు.

ఇంతే కాకుండా ఉల్లి రైతులను ఆదుకోవాలని వడ్డెపల్లి మండలానికి చెందిన శాంతినగర్‌, పైపాడు, కొంకల, ముండ్లదిన్నె, తాండ్రపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు మండల కేంద్రమైన శాంతినగర్‌లో కొన్ని రోజుల కిందట రాస్తారోకో చేపట్టారు. ఉల్లి ధరలు నెలలోపే మూడింతలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్‌లో వంద కేజీల ధర రు. 900 నుండి రు. రూ.వెయ్యి పలికింది. జులై నెలలో రు.800 రూపాయలు ఉండగా ఆగస్టు వచ్చే వరకు ధరలు మూడింతలు పడిపోయాయి. గత సంవత్సరం ఉల్లిపంట ఆగస్టు చివరి వరకు క్వింటా ధర రూ. 5వేల వరకు వచ్చింది. ఆ తర్వాత గిట్టుబాటు ధర లభించకపోవడంతో గొర్రెలు, మేకలు పశువులకు పంట పొలాన్ని వదులుకున్నారు. కనీసం ఈ సంవత్సరమైనా గిట్టుబాటు ధర లభించి గట్టెక్కుదామనుకున్నా రైతులకు ధరలు పడిపోవడంతో నిరాశనిస్ప్రుహలతో కొట్టుమిట్టాడుతున్నారు.

గత నెల మొదటి వారంలో రూ.వెయ్యి దాటిన ధర అకస్మాత్తుగా పడిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. అష్టకష్టాలు పడి పండించిన పంటకు ఒక్కసారిగా గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతుకు పాలుపోవడం లేదు. గద్వాల, అలంపూర్‌ నియోజవర్గాలకు చెందిన రైతులు అధిక మొత్తంలో ఉల్లిని పండించి కర్నూల్‌, హైదరాబాద్‌, రాయచూర్‌, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో అమ్ముకుంటారు. ఎక్కడికెళ్లినా కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి దాపురించింది. వడ్డెపల్లి మండలం పైపాడు గ్రామానికి చెందిన బోయ ఎల్లప్ప, శాంతినగర్‌కు చెందిన రైతు హన్మంతులు ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లిగడ్డలు అమ్మడానికి కర్నూల్‌ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లారు. తెచ్చిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ఆ ఇద్దరి రైతుల ఆవేదన కాదు నడిగడ్డ ఉల్లి రైతుల అందరి పరిస్థితి ఇదే విదంగా ఉంది. ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లి పంట ధరలు ఒక్క సారిగా మార్కెట్‌లో పడిపోయాయి. కానీ ప్రస్తుతం రు. 200 లోపే ధర ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకర సాగు చేయడానికి రు.60 వేలు ఖర్చు అవుతుండగా పంట అమ్ముతే రూ.10 వేలు రావడం లేదు. దీంతో ఉల్లి పండించిన రైతు కంట్లో కన్నీళ్ల్లువస్తున్నాయి. నడిగడ్డలోని గద్వాల, ధరూర్‌, మల్దకల్‌, అయిజ, గట్టు, ఇటిక్యాల, వడ్డెపల్లి మండలాల్లో రైతులు వ్యవసాయ బోరు బావుల కింద మే నెలలో ఉల్లి నాట్లు వేశారు.

వేసిన పంట చేతికి రావడంతో పంటను తీసి మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. అలంపూర్‌, మానవపాడు, వడ్డెపల్లి మండలాలకు చెందిన రైతులు అధికంగా వర్షాదారంపైనే ఆధారపడి ఉల్లి పంటను సాగు చేశారు. ఒక్కసారిగా పంట చేతికి రావడంతో ఇదే అదనుగా భావించిన వ్యాపారులు మద్దతు ధర ఇవ్వడం లేదు. గద్వాల మార్కెట్‌లో కేవలం ముగ్గురు, నలుగురే వ్యాపారస్తులు ఉండడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.

SHARE