పన్నీర్ పయనం ఎటు?

Posted February 15, 2017

panneer selvam destiny in tamilnaduచిన్నమ్మతో ఢీ అంటే ఢీ అన్న పన్నీర్ సెల్వం ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికీ సీఎంగా తనకు అవకాశాలున్నాయని పన్నీర్ చెబుతున్నారు. ఏ ధైర్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

తమిళనాడులో సీఎం రేసు నుంచి శశికళ అవుట్ కావటంతో ఇప్పుడు నెక్స్ట్‌ ముఖ్యమంత్రి ఎవరా అన్న ప్రశ్న మొదలైంది. తాను జైలుకు వెళ్లినప్పటికీ తన వర్గం వ్యక్తే సీఎం కావాలని భావించిన చిన్నమ్మ పళనిస్వామిని తెరపైకి తెచ్చారు. తనను ఎదురించిన పన్నీర్ సెల్వంకు చెక్‌ పెట్టే విధంగా… పళనిస్వామిని శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకునేలా చేశారు. ఈ దెబ్బతో సెల్వంకు షాక్ ఇచ్చినట్లేనని చిన్నమ్మ వర్గం భావిస్తోంది.

ఐతే చిన్నమ్మ ఇచ్చిన స్ట్రోక్‌ కు పన్నీర్ సెల్వం దిమ్మ తిరిగినట్లేనా? …శశికళతో పెట్టుకున్నందుకు ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుందా? అంటే పన్నీర్ సెల్వం ధీమా చూస్తే అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. శశికళ జైలుకు వెళ్లనున్న నేపథ్యంలో నెక్స్ట్‌ సీఎం నేనేనని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఐతే పన్నీర్ సెల్వం వెంట పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. తిరుగుబాటు జెండా ఎగురవేసి వారం రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో పన్నీర్ ఏం చేయవచ్చనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. శశికళ జైలుకు వెళ్లనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలలో చీలిక తేవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు పన్నీర్ లేఖ రాశారు. అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కానీ ఈ లేఖకు ఎమ్మెల్యేల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కానీ త్వరలోనే శశివర్గం నుంచి ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవచ్చని ఆయన భావిస్తున్నారు.

ఇది సాధ్యంకాని నేపథ్యంలో కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలనైనా చీలిక తెచ్చి…డీఎంకే మద్దతు తీసుకోవచ్చని పన్నీర్ వర్గం భావిస్తోంది. ఇక గవర్నర్‌ ముందు ఉన్న ఆప్షన్‌ లను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని పన్నీర్ ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలన్నదే ఆయన తొలి ప్రయత్నంగా ఉంది. బలవంతంగా రాజీనామా చేసిన నేపథ్యంలో రిజైన్ వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారని పన్నీర్ ఆశగా ఉన్నారు.

చివరిగా ఉమ్మడిగా బల నిరూపణకు గవర్నర్‌ ఆదేశాలు ఇస్తే…అప్పటికి పన్నీర్ బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. ఐతే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అన్నాడీఎంకే నుంచి పెద్దగా పన్నీర్ వర్గం వైపు ఎమ్మెల్యేలు వచ్చేలా లేరు. దీంతో డీఎంకే నుంచి మద్దతు వస్తే తప్ప పన్నీర్ గట్టెక్కడం కష్టమే.

SHARE