తెలుగువారిపైనే సెల్వం ఆశలు!!

Posted March 18, 2017

panneerselvam all hopes on telugu peoples in rk nagar by elections
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు ఇప్పుడు ఉనికిని చాటుకోవాల్సిన తరుణం వచ్చేసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో తన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందే. కనీసం గట్టిపోటైనా ఇస్తే… రాజకీయంగా తనకు ఢోకా ఉండదు. లేకపోతే ఆయనకున్న ఇమేజ్ దారుణంగా పడిపోవడం ఖాయం. తన వెనకున్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా జంప్ అయిపోయే అవకాశాలున్నాయి. అందుకే ఇక చావో రేవో తేల్చుకునేందుకు సెల్వం సారు సిద్ధమవుతున్నారు.

ఆర్కే నగర్ లో తన వర్గం నుంచి అన్నాడీఎంకే మాజీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్ ను బరిలోకి దింపబోతున్నారు సెల్వం. మధుసూదన్ ను అభ్యర్థిగా దింపడానికి ప్రధాన కారణం ఆర్కే నగర్ లో తెలుగువారి ఓట్లు ఎక్కువగా ఉండడమే. ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆర్కే నగర్ లో ఎవరు గెలవాలన్నా వారి మద్దతు కావాల్సిందే. కాబట్టి స్వతహాగా తెలుగు వ్యక్తి అయిన మధుసూదన్ ను బరిలోకి దింపారు సెల్వం. అంతేకాదు మధుసూదన్ అమ్మకు నమ్మిన బంటు. జయలలిత ఉన్నంత కాలం అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ గా ఆయనే కొనసాగారు. అమ్మకు అంత ప్రియమైన వ్యక్తి కాబట్టి.. ఆ సెంటిమెంటు కూడా కలిసి వస్తుందని సెల్వం భావిస్తున్నారు.

మరి పన్నీర్ సెల్వంను తెలుగు ప్రజలు కరుణిస్తారా…? తెలుగు వ్యక్తి .. అందులోనూ అమ్మకు అత్యంత ప్రియమైన వ్యక్తి అయిన మధుసూదన్ ను గెలిపిస్తారా…? లేదా ఇతర అభ్యర్థివైపు మొగ్గు చూపుతారా? మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.

SHARE