Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అన్నాడీఎంకేను శశికళ నాశనం చేస్తున్నారు. విలీన చర్చలకు దినకరనే అడ్డు. ఇప్పుడు వీరిద్దరూ జైలుకు వెళ్లడంతో ఇంకేముందు అంతా సుఖాంతమే. ఇదీ ఇప్పటివరకూ ఉన్న అంచనా. కానీ పరిస్థితి అడ్డం తిరిగినట్లు కనిపిస్తోంది. ఓవైపు అగ్రనేతల మధ్య మంతనాలు జరుగుతుండగానే.. మరోవైపు జిల్లా కార్యదర్శుల్లో మెజార్టీ సభ్యులు శశికళ, దినకరన్ ను సమర్థించడం సీఎం పళనిస్వామికి మింగుడు పడటం లేదు. జిల్లా కార్యదర్శుల అభిప్రాయం మాత్రమే ఇలా ఉందా.. లేదంటో లోలోపల కిందిస్థాయి క్యాడర్ కూడా ఇదే అనుకుంటున్నారా అనే అంశం ఆసక్తికరంగా ఉంది. శశి జైలు కెళ్లిన దగ్గర్నుంచీ జరుగుతున్న పరిణామాలతో క్యాడర్ విరక్తి చెందినట్లు కనిపిస్తోంది.
కేంద్రం ఆడుతున్న గేమ్ లో పన్నీర్, పళని కీలుబొమ్మలేనని, వీరిలో ఎవరూ సీఎం అయినా ఒరిగేదేమీ లేదనే కొత్త వాదన బయల్దేరింది. దశాబ్దాలుగా ఢిల్లీని ఎదిరించి సొంత అస్తిత్వాన్ని నిలుపుకుంటున్న తమిళ ప్రజలకు.. ఇప్పటి పరిస్థితి మింగుడుపడటం లేదు. తమ నేతలు ఇంత వెన్నెముక లేనివారిగా తయారయ్యారేంటనే చర్చ జరుగుతోంది. జయ, కరుణానిధికి వంగి వంగి దండాలు పెట్టినా వారు తమిళ నేతలే కాబట్టి సర్దుకుపోయామని, కానీ ఢిల్లీ నేతల ముందు సాష్టాంగపడితే అసలుకే ఎసరు వస్తుందని పన్నీర్, పళనికి కిందిస్థాయి నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా విలీన డ్రామాకు తెరదించాలని రెండు వర్గాలు నిర్ణయించాయి.
ఫైనల్ ప్రపోజల్ ఒకటి తయారైంది. దీని ప్రకారం సీఎంగా పళనిస్వామి కొనసాగుతారు. మార్గదర్శక మండలి అధ్యక్షుడిగా పన్నీర్ ఎన్నికవుతారు. మార్గదర్శక మండలి అభిప్రాయం మేరకే పార్టీ, ప్రభుత్వం నడుస్తాయి. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహించేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆ తర్వాత మాత్రం మెజార్టీ అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఓ అంగీకారం కుదిరింది. అయినా సరే ఫైనల్ స్టేట్ మెంట్ ఇవ్వడానికి మాత్రం రెండు వర్గాల్లో ఎవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు విలీన చర్చలు తుదిదశకు చేరుకున్న తరుణంలో.. ఓ హోటల్లో 28 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు సమావేశమై మంత్రి పదవుల గురించి చర్చలు జరపడం పలు అనుమానాలకు తావిస్తోంది.